Revanth Reddy

Revanth Reddy: 22ఏ సమస్యలకు చెక్.. వారం రోజుల్లో పెండింగ్ రిజిస్ట్రేషన్ల క్లియరెన్స్

Revanth Reddy: సెక్షన్ 22ఏ (నిషేధిత జాబితా) భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం పక్కా కార్యాచరణ సిద్ధం చేసింది. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 22ఏ పరిధిలోని భూముల సమస్యల్లో ప్రభుత్వం 12 ప్రధాన అంశాలను గుర్తించిందని, అర్హులైన ప్రజలకు ఊరట కల్పించేలా త్వరలోనే యూఎల్‌సీ (ULC) భూములపై నూతన విధానాన్ని తీసుకువస్తామని ప్రకటించారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ‘ధరణి’ పోర్టల్ వెనుక జరిగిన భారీ అవినీతిని ఎండగడుతూ ప్రతిపక్షానికి నేరుగా సవాల్ విసిరారు.

22ఏ భూములు, రిజిస్ట్రేషన్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు..

  • వారం రోజుల్లో పెండింగ్ రిజిస్ట్రేషన్లు క్లియర్..
    అధీకృత (Approved) లేఅవుట్లలో పెండింగ్‌లో ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్ల సమస్యలను కేవలం వారం రోజుల్లో పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. హెచ్ఎండీఏ (HMDA), డీటీసీపీ (DTCP) అనుమతులు పొందిన లేఅవుట్ల రిజిస్ట్రేషన్లను ఎలాంటి అడ్డంకులు లేకుండా చేపడతామని స్పష్టం చేశారు.
  • నిషేధిత జాబితా నుంచి వీటి తొలగింపు:
    ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించిన భూములను 22ఏ నుంచి తొలగిస్తామన్నారు. ముఖ్యంగా జీవో 58, జీవో 59, జీవో 166 కింద రెగ్యులరైజ్ అయిన భూములకు ఈ ఊరట లభిస్తుంది.
  • వేలం, బ్యాంకు భూములకు విముక్తి:
    ప్రభుత్వం ద్వారా వేలంలో కొనుగోలు చేసిన భూములతో పాటు, బ్యాంకుల్లో తనఖా పెట్టి చట్టబద్ధంగా వేలం వేసిన భూములను కూడా 22ఏ నిషేధిత జాబితా నుంచి శాశ్వతంగా తొలగిస్తామని తెలిపారు.
  • కలెక్టర్లు, ఆర్డీవోలకు అధికారాలు:
    పొరపాటున ఏవైనా వ్యక్తిగత పట్టా భూములు 22ఏ జాబితాలో చేరితే.. వాటిని సరిచేసి తొలగించే బాధ్యతను జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలకు అప్పగిస్తూ స్పష్టమైన నిబంధనలు రూపొందిస్తున్నామని చెప్పారు.

ధరణి పుట్టుక వెనుక భూదోపిడీ – కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు..

  • నీటి ప్రాజెక్టుల తర్వాత భూములపై కన్ను:
    గత బీఆర్ఎస్ పాలకులు నీటి ప్రాజెక్టుల్లో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, ఆ తర్వాత కేసీఆర్ దృష్టి రాష్ట్రంలోని విలువైన భూములపై పడిందని రేవంత్ ధ్వజమెత్తారు. భూదోపిడీ చేయాలనే దురాలోచనతోనే ‘ధరణి’ అనే పురుగును పుట్టించారని, అది ఇప్పుడు భూతమై తెలంగాణ సమాజాన్ని పట్టి పీడిస్తోందని మండిపడ్డారు.
  • ఒడిశా మూలాలు – శ్రీధరరాజు వాటా:
    ధరణిని తామే స్వయంగా మెదడు రంగరించి తయారు చేశామని కేసీఆర్, సోమేశ్ కుమార్ చెప్పింది పచ్చి అబద్ధమన్నారు. వాస్తవానికి 2010లోనే ధరణి ఒడిశాలో ప్రారంభమైందని, 2014లో కాగ్ (CAG) ఆ సాఫ్ట్‌వేర్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. 2018లో ధరణి కాంట్రాక్టును దక్కించుకున్న ఐఎల్‌ఎఫ్‌ఎస్ (IL&FS).. దానిని టెరాసిస్ కంపెనీకి అమ్మిందని, అందులో శ్రీధరరాజుకు వాటా ఉందని సీఎం వివరించారు.

కోటి ఎకరాల ఆరోపణలపై కేసీఆర్‌కు ఓపెన్ ఛాలెంజ్..

  • నిషేధిత జాబితాలో ఉండాల్సిందే:
    ప్రస్తుత ప్రభుత్వం కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిందని చేస్తున్న ప్రచారాన్ని సీఎం ఖండించారు. చెరువులు, అటవీ భూములు, ప్రభుత్వ స్థలాలు వంటివి ఆ కోటి ఎకరాల్లో ఉన్నాయని, అవి నిషేధిత జాబితాలో లేకపోతే పేదలకు అన్యాయం జరిగినట్లేనని స్పష్టం చేశారు. ఆ కోటి ఎకరాల నుంచి ఇంచు భూమైనా తొలగించే శక్తి ఎవరికైనా ఉందా అని రేవంత్ సవాల్ విసిరారు. దమ్ముంటే ఆ భూములను తొలగించమని కేసీఆర్ స్వయంగా లేఖ రాయగలరా అని ప్రశ్నించారు.
  • అసలు వివాదం 3.73 లక్షల ఎకరాలే:

    మొత్తం వివాదమంతా కేవలం 3.73 లక్షల ఎకరాల ప్రైవేట్ పట్టా భూముల గురించేనని, ఆ కొద్దిపాటి భూములను అడ్డుపెట్టుకుని కోటి ఎకరాలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హైకోర్టు ఆదేశాల మేరకే 2025లో నిషేధిత భూముల జాబితాను అధికారికంగా పబ్లిక్ డొమైన్‌లో ఉంచినట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *