గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై వేధింపులు – ప్రాణాపాయం నుంచి త్రుటిలో..
సియా అనే యువతి ఆదివారం తన బైకర్ గ్రూప్‌తో కలిసి గురుగ్రామ్‌లోని ప్రముఖ ‘గోల్ఫ్ కోర్స్ రోడ్’ మీదుగా తన ఏప్రిలియా (Aprilia RS 457) బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో హర్యానా రిజిస్ట్రేషన్ కలిగిన ఓ మారుతి సుజుకి సియాజ్ కారు ఆమె బైక్‌ను వెంబడించడం ప్రారంభించింది. కారులో ఉన్న వ్యక్తులు మద్యం మత్తులో దూకుడుగా ప్రవర్తిస్తూ, బైక్‌ను ఆపాలంటూ సైగలు చేస్తూ వేధించారు. తన వెనుక పడొద్దని, కాస్త దూరంగా (డిస్టెన్స్) వెళ్లాలని సియా వారికి సూచిస్తూ ముందుకు సాగింది. ఆమె స్నేహితులు కూడా ఆ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ కారులోని వ్యక్తులు వినకుండా ఆమెను వెంబడించారు. చివరకు కారు డ్రైవర్ కావాలనే బైక్‌కు అడ్డంగా కారును తిప్పి, సైడ్ నుంచి బలంగా ఢీకొట్టాడు. దీంతో నియంత్రణ కోల్పోయిన సియా బైక్‌తో సహా రోడ్డుపై జారిపడి తీవ్ర గాయాల పాలైంది. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ ఆపకుండా అక్కడి నుంచి వేగంగా పరారయ్యాడు.
ప్రమాదం జరిగిన వెంటనే సియా స్నేహితులు ఆ కారును బైక్‌లపై వెంబడించారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆగగానే అందులోని డ్రైవర్‌ను పట్టుకుని నిలదీశారు. అయితే కారులో ఉన్నవారు తమ తప్పేమీ లేదన్నట్లు బుకాయిస్తూ, దుర్భాషలాడుతూ అక్కడి నుంచి కారుతో పారిపోయారు. బైక్‌కు ఉన్న యాక్షన్ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ స్పష్టంగా రికార్డయ్యాయి.
కారు ఎవరిది? – విచారణలో కీలక అంశాలు..
కారు నెంబర్ HR30Y4949 ఆధారంగా దర్యాప్తు చేయగా, అది హర్యానాలోని పల్వాల్‌కు చెందిన మనీష్ పేరిట రిజిస్టర్ అయి ఉన్నట్లు తేలింది. అయితే అసలు యజమాని మనీష్ తాను ఆర్మీ ఉద్యోగినని, ప్రస్తుతం అసోంలో విధుల్లో ఉన్నానని తెలిపారు. ఆదివారం తన స్నేహితుడు కళ్యాణ్ తన కుటుంబ సభ్యుల వద్ద నుంచి కారును తీసుకెళ్లాడని, వీడియో వైరల్ అయ్యాకనే తనకు విషయం తెలిసిందని వివరణ ఇచ్చారు.
ప్రాణాలతో చెలగాటమాడుతూ హిట్ అండ్ రన్‌కు పాల్పడిన నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బాధితురాలు సియా గురుగ్రామ్ పోలీసులను వేడుకున్నారు. మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్న ఇలాంటి ఆకతాయిలపై నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.