James Comey: అమెరికా రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర దుమారం రాజుకుంటోంది. కారణం – ఎఫ్‌బీఐ (FBI) మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్. “8647” అనే కోడ్‌లాంటి అంకెలను బీచ్‌లో గవ్వలతో ఏర్పాటుచేసి, ఆ ఫోటోను ‘‘నా బీచ్ వాక్‌లో కూల్ షెల్ నిర్మాణం’’ అనే శీర్షికతో తన ఇన్‌స్టాలో షేర్ చేయడం పెద్ద వివాదంగా మారింది.
ఈ పోస్టు త్వరలోనే తొలగించినా, దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే ఆ నెంబర్లకు ఉన్న దాచిన అర్థంపై రాజకీయ వర్గాల్లో సందేహాలు మొదలయ్యాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 47వ అధ్యక్షుడు కాగా, అమెరికన్ గ్యాంగ్ సంస్కృతిలో “86” అనే నంబరు ‘తొలగించు’ లేదా ‘హత్య చెయ్యి’ అనే అర్థంలో ఉపయోగించబడుతుంది. ఈ నేపథ్యంలో ‘‘8647’’ అనగా ‘‘47వ అధ్యక్షుడిని తొలగించు’’ లేదా ‘‘హత్య చేయి’’ అనే కోడ్ మెసేజ్‌గా భావించడంతో, జేమ్స్ కామీ నిజంగా ట్రంప్‌పై మౌఖిక బెదిరింపు చేశారా? అన్న అనుమానాలు వస్తున్నాయి.
Ex-FBI Director James Comey under probe following “8647” post; Trump officials call it death threat
Read @ANI Story | https://t.co/FlUkla4Jsd#JamesComey #FBI #US #DonaldTrump pic.twitter.com/VajuHdnb1u
— ANI Digital (@ani_digital) May 16, 2025
ఈ సంఘటనపై ట్రంప్ మద్దతుదారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కామీపై నేరుగా ఆరోపణ చేస్తూ, ‘‘కోమీ నా తండ్రిని హత్య చేయాలని పిలుపునిచ్చాడు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖులు మేఘన్ మెక్‌కెయిన్, దక్షిణ డకోటా గవర్నర్ క్రిస్టి నోయెమ్ వంటి వారు ఈ పోస్టును ప్రమాదకరమైనదిగా అభివర్ణించి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
దీనిపై స్పందించిన కామీ, తన ఉద్దేశం తప్పుడు తన ఉద్దేశం తప్పుడు కోణంలో అర్థం చేసుకున్నారని, తాను హింసను తృణమాత్రంగా కూడా ప్రోత్సహించనని స్పష్టం చేశారు. ‘‘ఆ నెంబర్లకు అంత అర్థం ఉండటం నాకు తెలియదు. గవ్వలతో చేయబడ్డ కళాత్మక నిర్మాణం మాత్రమే అది. దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు’’ అని పేర్కొన్నారు.
అయితే ఇప్పటికే యుఎస్ సీక్రెట్ సర్వీస్, హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించాయని అధికారికంగా వెల్లడించారు. FBI కూడా సపోర్ట్‌గా ఉందని సమాచారం.
జేమ్స్ కామీ గతంలో ఎఫ్‌బీఐ ఏడవ డైరెక్టర్‌గా 2013 నుంచి 2017 వరకు సేవలందించారు. ట్రంప్ తన మొదటి పాలనలో కొద్ది కాలానికే కామీని పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. 2016 ఎన్నికల సమయంలో హిల్లరీ క్లింటన్ ఈమెయిల్ స్కాండల్ దర్యాప్తును నడిపించడం ద్వారా ఆయన బాగా వార్తల్లోకి వచ్చారు. అప్పటి నుంచి కామీ, ట్రంప్ మధ్య విభేదాలు ఉండటం అనేకమంది గుర్తుచేస్తున్నారు.
ఇప్పుడు ఇలాంటి ఒక సంకేతాత్మక పోస్ట్ చేసి, ఆపై తాను నిష్పాపుడినని చెబుతున్న కామీపై, ప్రజా వర్గాల్లో అనుమానాలు అలాగే కొనసాగుతున్నాయి. ఇది స్వేచ్ఛా భావ ప్రకటనా? లేక ఒక సన్నిహిత హెచ్చరికా? అన్న ప్రశ్నలు ఇంకా నిరుత్తరంగానే ఉన్నాయి.