Paradha: తొలి చిత్రం ‘సినిమా బండి’తో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించిన రెండో సినిమా ‘పరదా’. ప్రముఖ దర్శక నిర్మాతలు రాజ్, డీకే సహకారంతో శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా టీజర్ ను దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు, మలయాళ భాషల్లో జనం ముందుకు రాబోతోంది. టీజర్ లాంచ్ సందర్భంగా అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ, ”తాను చిత్రసీమకు వచ్చి పదేళ్ళు అవుతోందని, ఈ పదేళ్ళలో తన మోస్ట్ ఫేవరెట్ మూవీ ‘పరదా’ అని తెలిపింది. అనుపమా, సంగీతతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని దర్శన తెలిపింది. ప్రవీణ్ కండ్రేగుల నెక్ట్స్ జనరేషన్ డైరెక్టర్ అని సంగీత అభివర్ణించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శరత్ మరార్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు దర్శక నిర్మాతలు ధ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమా కమర్షియల్ గానూ విజయం సాధించి, ఉమెన్ ఓరియంటెడ్ మూవీస్ కు బిగ్ ఓపెనింగ్స్ ఇస్తుందని దర్శకుడు ప్రవీణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రనిర్మాణంలో సహకరించిన అందరికీ నిర్మాత శ్రీధర్ ధన్యవాదాలు తెలిపారు.
