Road Accident: ఆనందంతో ఆ అమ్మాయి బస్సు ఎక్కింది. తెల్లారితే ..చేరాల్సిన చోటికి చేరుతుంది. అందరు నిద్రపోతున్నారు. అంతలో ఒక శబ్దం. కళ్ళు మూసి తెరిచేలోపే..ఆమె చనిపోయింది. ఇంతకి ఏమైంది ? ఆ బస్సు ప్రమాదం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి ? ఆ మలుపు వద్దే ఎందుకు ఇలా ఈ ప్రమాదం జరిగింది ?
రాజమండ్రి సమీపంలో అర్థరాత్రి ఓ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృత్యువాత పడగా, 18 మంది గాయపడ్డారు. మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఘటన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు.
విశాఖ నుంచి హైదరాబాద్‌కు 50 మంది ప్రయాణికులతో కావేరి ట్రావెల్ కి చెందిన బస్సు బయలుదేరింది. విశాఖలో రాత్రి బయలుదేరిన ఈ బస్సు, అర్థరాత్రి అయ్యేసరికి రాజమండ్రి సమీపంలో ప్రమాదానికి గురైంది. రాజమండ్రి రూరల్ కాతేరు-కొంతమూరు మధ్య బస్సు బోల్తా పడింది. ఆ ప్రాంతంలో రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
డైవర్షన్ ఇచ్చిన విషయాన్ని డ్రైవర్ గమనించలేదు. వేగంగా వెళ్తున్న బస్సుకు ఒక్కసారి బోర్డు కనిపించింది. వెంటనే దాన్ని టర్న్ చేసే క్రమంలో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 ఏళ్ల యువతి స్పాట్‌లో మృతి చెందింది. మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.ప్రమాదం విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఓ వైపు అంబులెన్స్, మరోవైపు క్రేన్ వచ్చింది. రోడ్డుపైనున్న బస్సును క్రేన్‌తో పక్కకు తప్పించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. గాయపడినవారిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు. కొంతమంది అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.
గాయపడిన వారిలో కొందర్ని డిశ్చార్జ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రయాణికుల నుంచి సమాచారం సేకరించారు. మృతి చెందిన యువతి విశాఖకు చెందినదిగా గుర్తించారు. టెక్కీ కంపెనీలో జాబ్ కోసం విశాఖ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. అంతలోనే యువతి ఈ లోకాన్ని విడిచిపెట్టింది.