Crime News: తండ్రి అనేవాడు పిల్లలకి రక్షణగా ఉంటూ వాళ్లకి ఎటువంటి సమస్య రాకుండా చూసుకునేవాడు. కానీ అదే కన్నతండ్రి ఓ కీచకుడిలా మారితే.. కళ్లెదుటే బిడ్డ జీవితం నాశనమవుతుంటే ఏ తల్లి మాత్రం చూస్తూ ఊరుకుంటుంది? హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సరిగ్గా ఇలాంటి గుండె పగిలే ఘటనే జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయి సొంత కూతురిపైనే అత్యాచారానికి ఒడిగట్టిన భర్తను.. కన్నబిడ్డను కాపాడుకునేందుకు ఓ తల్లి గొడ్డలితో నరికి చంపేసింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ భయానక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఆ ఇంట్లో రోజూ అర్ధరాత్రి గొడవలే.. అసలు కారణం తెలిస్తే షాక్!
పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. మచ్చ బొల్లారం డివిజన్‌లోని పెద్ది పరమారెడ్డి కాలనీలో బొడ్డు శ్రీనివాస్, రమాదేవి దంపతులు తమ పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు.బయటకు ఇదొక సాధారణ కుటుంబంలా కనిపించినా.. ఆ ఇంట్లో తరచూ అర్ధరాత్రి వేళల్లో తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతుండేవి. పెద్దపెద్దగా అరుపులు, కేకలు విన్న చుట్టుపక్కల వారు ఏదో భార్యాభర్తల గొడవలే అనుకున్నారు. కానీ, ఆ గొడవల వెనుక శ్రీనివాస్ నీచమైన బుద్ధి దాగుందని ఎవరూ ఊహించలేకపోయారు. వావివరుసలు మరిచిన శ్రీనివాస్.. గత కొంతకాలంగా తన సొంత కూతురిపైనే కన్నేసి పైశాచికంగా వేధించడం మొదలుపెట్టాడు.
కళ్లెదుటే ఘోరం.. కాళికలా మారిన తల్లి..
ఆదివారం అర్ధరాత్రి శ్రీనివాస్ రాక్షసత్వం హద్దులు దాటింది. ఇంట్లో ఎవరూ చూడటం లేదనుకుని కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బిడ్డ ఏడుపులు, భర్త చేస్తున్న దారుణాన్ని కళ్లారా చూసిన తల్లి రమాదేవి తట్టుకోలేకపోయింది.
బిడ్డ శీలాన్ని, ప్రాణాలను రక్షించుకోవడానికి క్షణాల్లో నిర్ణయం తీసుకుంది. వెంటనే ఇంట్లోని గొడ్డలి అందుకుని, విచక్షణ కోల్పోయి కూతురిపై పడుతున్న భర్త శ్రీనివాస్‌పై ఒక్కసారిగా దాడి చేసింది. ఆమె గొడ్డలితో బలంగా నరకడంతో తీవ్ర రక్తస్రావమై శ్రీనివాస్ అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.
కేకలు వేసిన పిల్లలు.. పోలీసులకు లొంగిపోయిన భార్య..
ఈ ఊహించని పరిణామంతో ఇంట్లోని మిగతా పిల్లలు భయంతో పెద్దగా కేకలు వేశారు. ఆ అరుపులు విని ఇరుగుపొరుగు వారు పరుగున వచ్చి చూసేసరికి శ్రీనివాస్ శవమై పడి ఉన్నాడు. స్థానికులు వెంటనే అల్వాల్ పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. రక్తపు మడుగులో ఉన్న శ్రీనివాస్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అటు తన బిడ్డ కోసం భర్తను అంతం చేసిన రమాదేవి.. పిల్లలను తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
