Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెసీమల రూపురేఖలను సమూలంగా మార్చే లక్ష్యంతో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రామాపురంలో ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమాన్ని మంగళవారం అట్టహాసంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ.. కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి ఇస్తున్న అత్యున్నత ప్రాధాన్యతను చాటిచెప్పారు. రాబోయే కాలంలో పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగాల ద్వారా రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ.1.30 లక్షల కోట్లతో భారీ అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని ప్రకటించారు.
గత వైసీపీ పాలనతో పోలిస్తే పది రెట్ల ప్రగతి..
గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పనితీరుతో పోలుస్తూ పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కేవలం 880 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మిస్తే.. మేం అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్లలోనే దానికి పది రెట్లు ఎక్కువగా ఏకంగా 9,000 కిలోమీటర్లకు పైగా రోడ్లను పూర్తి చేశాం.
వైసీపీ పాలనలో కేవలం 304 మినీ గోకులాలు నిర్మిస్తే.. కూటమి సర్కార్ ఇప్పటికే 30,000కు పైగా మినీ గోకులాలను నిర్మించి చూపించింది. 304 ఎక్కడ.. 30,000 ఎక్కడో ప్రజలు బేరీజు వేసుకోవాలి” అని అన్నారు. 2019-24 మధ్య పంచాయతీలను గాలికొదిలేశారని, కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనేందుకు కూడా గ్రామాల్లో నిధులు లేకుండా చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు సుదీర్ఘ అనుభవం, ప్రధాని నరేంద్ర మోదీ సంపూర్ణ సహకారంతో పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేశామని స్పష్టం చేశారు.
రూ.11,085 కోట్లతో ‘పల్లె పండుగ 3.0’ పనుల వివరాలు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో పల్లె పండుగ 3.0 పనులు సాగనున్నాయి. ఇందులో కేంద్రం వాటా రూ.5,400 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.5,700 కోట్లు సమకూరుస్తోంది.
-
రహదారులు & డ్రైన్లు: 6,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 1,000 కిలోమీటర్ల మేర మురుగు కాలువల (డ్రైన్స్) నిర్మాణం.
-
వ్యవసాయం & పాడి: 22,500 మినీ గోకులాల నిర్మాణం, 50 వేల ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం, ఫామ్ పాండ్స్ నిర్మాణం.
-
మౌలిక వసతులు: గ్రామ పంచాయతీ భవనాలు, బస్ షెల్టర్లు, రచ్చబండల నిర్మాణం.
-
డొంక రోడ్ల పైలట్ ప్రాజెక్ట్: రైతుల పొలాలకు వెళ్లేందుకు వీలుగా రాష్ట్రంలోని 161 గ్రామీణ నియోజకవర్గాల్లో డొంక రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, మారుమూల గిరిజన తండాలకు కూడా పక్కా రోడ్లు వేస్తున్నామని తెలిపారు.
ఉదయగిరి నియోజకవర్గానికి మహర్దశ – పవన్ ప్రత్యేక హామీలు..
చారిత్రక ప్రాధాన్యత ఉండి, తీవ్రమైన వలసల సమస్యను ఎదుర్కొంటున్న ఉదయగిరి ప్రాంత రూపురేఖలు మార్చేందుకే ఈ సభను ఇక్కడ నిర్వహించామని పవన్ తెలిపారు:
-
రూ.52 కోట్లతో సుజలా స్రవంతి: ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి గతంలో నిలిచిపోయిన ‘సుజలా స్రవంతి’ ప్రాజెక్టును రూ.52 కోట్లతో పునరుద్ధరించి 381 తాగునీటి పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ‘అమరజీవి జలధార’ పథకం ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందిస్తామని చెప్పారు.
-
ఉదయగిరి కోట పర్యాటకాభివృద్ధి: ఉదయగిరి కోటకు వెళ్లే ఘాట్ రోడ్డు నిర్మాణానికి తక్షణమే రూ.2.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అటవీ అనుమతులను వేగవంతం చేసి, ఉదయగిరి కోటను ప్రముఖ హెరిటేజ్, ఎకో టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు రప్పిస్తామని హామీ ఇచ్చారు.
ప్రజలే పనులను పర్యవేక్షించాలి – సోషల్ ఆడిట్ నిర్వహిస్తాం
అభివృద్ధి పనుల్లో నాణ్యత, పారదర్శకతే తమ ప్రాధాన్యతని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు:
“మీ గ్రామంలో జరుగుతున్న పనులను ప్రజలు తమ సొంత పనులుగా భావించి నిరంతరం పరిశీలించాలి. కాంట్రాక్టర్లు క్వాలిటీగా పనిచేస్తున్నారా లేదా అని గమనించాలి. ఎక్కడైనా లోపాలు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లండి. అవసరమైన చోట స్వయంగా సోషల్ ఆడిట్ నిర్వహిస్తాం. ప్రజల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి సద్వినియోగం కావాలి.”
