Bollaram Army Weapons Theft Case: సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో జరిగిన అత్యంత సంచలనాత్మక సైనిక ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మిలిటరీ స్థావరం నుంచి ఆర్మీ తుపాకులు, బుల్లెట్లను దొంగిలించిన వ్యవహారంలో ప్రధాన నిందితుడైన మాజీ హవల్దార్ మల్లేశ్‌కు ఆయుధాగారం (ఆర్మరీ) ఇన్‌చార్జ్‌లే స్వయంగా సహకరించినట్లు విచారణలో తేలింది. దీంతో వెపన్స్ గోడౌన్ కీపర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వినోద్, శేషులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
కీపర్లతో మల్లేశ్ కుమ్మక్కు – భారీగా ఆర్థిక లావాదేవీలు..
మిలిటరీ క్యాంపులోని అత్యంత పటిష్ట భద్రత ఉండే ఆయుధాగారం నుంచి తుపాకులు, లైవ్ బుల్లెట్లను బయటకు తరలించేందుకు కీపర్లు వినోద్, శేషులతో కలిసి మల్లేశ్ పక్కా పథకం రచించాడు. లోపలి వారి తోడ్పాటు లేనిదే ఆయుధాలు బయటకు రావడం అసాధ్యమని గుర్తించిన పోలీసులు, వారిద్దరి పాత్రపై పక్కా ఆధారాలు సేకరించారు.
ఈ దొంగిలించిన ఆయుధాలను ఎవరికైనా విక్రయించారా, గ్యాంగ్స్టర్లకు లేదా సంఘవిద్రోహ శక్తులకు సరఫరా చేశారా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరింత మంది పాత్రపై పోలీసులు త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
