WPL 2025: మహిళా ప్రీమియర్ లీగ్ లో నిన్న జరిగిన మ్యాచ్లో, దిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ అద్భుతమైన ప్రదర్శన కనబర్చి ముంబై ఇండియన్స్ పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఏమాత్రం వచ్చింది లేకుండా ఎంతో అవలీలగా మ్యాచ్ ఆరంభం నుండి అతి పటిష్టమైన ముంబై జట్టుపై ఢిల్లీ ఆధిపత్యం చెలాయించింది. ఈ గెలుపుతో, దిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది, ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో ఉంది.
124 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ క్యాపిటల్స్ కేవలం 14.3 ఓవర్లలోనే ఒకే ఒక్క వికెట్ కోల్పోయి సాధించింది. కెప్టెన్ మెగ్ లానింగ్ 49 బంతుల్లో 9 ఫోర్లతో 60 పరుగులు చేసి అదిరిపోయే ఆరంభం ఇవ్వగా మరొక ఓపెనర్ షఫాలీ వర్మ 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులు చేసి ధాటిగా ఆడారు. ఇక వీరిద్దరి అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శనతో తొలి వికెట్ పడేలోపే మ్యాచ్ ఫలితం అందరికీ అర్థం అయిపోయింది.
షఫాలీ వర్మ ఔటైన తర్వాత, మెగ్ లానింగ్ జెమీమా రోడ్రిగ్స్ 15 నాటౌట్ తో కలిసి లక్ష్యాన్ని సాధించారు. ముంబై బౌలర్లలో అమన్జ్యోత్ కౌర్ ఒక వికెట్ తీసుకున్నారు. ఢిల్లీ బ్యాటర్ల జోరుకి ముంబై బౌలర్ల వద్ద సమాధానం లేకపోయింది. పవర్ ప్లే లోనే ఓపెనర్లు ఇద్దరూ కలిసి వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేయడం విశేషం.
Also Read: IND vs NZ: రేపు మ్యాచ్ కు రోహిత్ డౌటే..?
WPL 2025: ఇక ముంబై ఇండియన్స్ ముందుగా బ్యాటింగ్ చేసి, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 123 పరుగులు స్కోర్ చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్తో 22 పరుగులు చేయగా… స్టార్ బ్యాటర్లు అయిన హేలీ మాథ్యూస్ 22 పరుగులు, సివర్ బ్రంట్ 18 పరుగులు మాత్రమే చేయడంతో ముంబై ఏ దశలోనూ పుంజుకోలేదు.
వారితో పాటు అమేలియా కెర్ మరియు అమన్జ్యోత్ కౌర్ కూడా తమకు లభించిన ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోకపోవడంతో ముంబై అతి తక్కువ స్కోరుకే కట్టడి అయింది. దిల్లీ బౌలర్లలో జొనాసెన్ మరియు మిన్ను మణి ఒక్కొక్కరు 3 వికెట్లు తీశారు, అన్నాబెల్ సథర్ ల్యాండ్ మరియు శిఖా పాండే ఒక్కొక్కరు ఒక వికెట్ తీసుకున్నారు. అద్భుతమైన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టు కీలక వికెట్లు పడగొట్టిన జొనాసెన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మార్చి 1న జరగబోయే తదుపరి మ్యాచ్లో, దిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కొంటుంది.