Daaku Maharaaj: సంక్రాంతి కానుకగా బరిలోకి దిగిన బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా అనంతపురంలో బుధవారం విజయోత్సవ వేడుకను నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్వహించారు. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ”ఆదిత్య 369 లో నేను పోషించిన కృష్ణదేవరాయ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయింది. అలాంటి గుర్తుండిపోయే పాత్రలు చేయాలనే ఆలోచన నుంచి డాకు మహారాజ్ పాత్ర పుట్టింది. కోవిడ్ సమయంలో సాహసించి అఖండ సినిమాను విడుదల చేశాం. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ఈ సినిమాలు అభిమానులకు నచ్చడమే కాకుండా.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ సంతోషంగా ఉండేలా చేశాయి. నేను సినిమా కలెక్షన్స్ గురించి పట్టించుకోను. నా రికార్డులన్నీ ఒరిజినల్ అని, నా కలెక్షన్స్ అన్నీ ఒరిజినల్ అని, నా అవార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని, నా రివార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని నా అభిమానులకు తెలుసు” అన్నారు.
Daaku Maharaaj: సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే బాలకృష్ణ గారి అభిమానులు ఫోన్లు, మెసేజ్ లు చేసి మంచి సినిమా చేశారని మెచ్చుకున్నారని దర్శకుడు బాబీ చెప్పారు. ‘భైరవ ద్వీపం’ సినిమాతోనే డ్రమ్మర్ గా తన కెరీర్ మొదలైందని, అలాంటి తాను బాలకృష్ణగారికి సినిమాలకు సంగీతాన్ని అందించడం ఆనందంగా ఉందని తమన్ అన్నారు. ఈ వేడుకలో ప్రగ్యాజైస్వాల్, శ్రద్థా శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా, బాలనటి వేద అగర్వాల్, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి తదితరులు పాల్గొని చిత్రం సాధించిన అఖండ విజయం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ వేడుకలో బాలకృష్ణ స్వయంగా ”గణ గణ గణ ఆంధ్ర తెలంగాణ” పాటను పాడి అభిమానుల్లో ఉత్సాహం నింపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.