Daaku Maharaaj: బాలకృష్ణ అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూ ‘డాకు మహారాజ్’ మూవీ నచ్చుతుందని దర్శకుడు బాబీ కొల్లి చెబుతున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ ఈ సంక్రాంతికి మరో వైవిధ్యమైన చిత్రంతో వస్తున్నారని ఆయన అన్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో అంచనాలు రెట్టింపు అయ్యాయని, ఈ సినిమాను తెలుగులో పాటు తమిళంలోనూ 12న విడుదల చేయబోతున్నామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శక నిర్మాతలతో పాటు హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, శ్రద్థా శ్రీనాథ్ పాల్గొన్నారు. అమెరికా నుండి బాలకృష్ణ సోమవారం వచ్చారని, అనంతపురంలో ఆయన ఆధ్వర్యంలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నామని నాగవంశీ చెప్పారు. ఆంధ్రాలో ఈ సినిమా టిక్కెట్ రేట్లు పెంచుతూ ఇప్పటికే జీవో వచ్చిందని, తెలంగాణ టిక్కెట్ రేట్లు పెంచమని ప్రభుత్వాన్ని కోరడం లేదని ఆయన తెలిపారు. ఈ సినిమా తన పుట్టిన రోజైన జనవరి 12న విడుదల కాబోతుండటం ఆనందంగా ఉందని ప్రగ్యా జైస్వాల్ తెలిపింది. తన సినీ ప్రయాణంలో ఈ సినిమా ప్రత్యేకమైనదని శ్రద్ధా శ్రీనాథ్ చెప్పింది.