Congress: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశం ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో తీవ్ర అసహనానికి గురిచేస్తున్నది. ప్రభుత్వం ఏర్పాటై 16 నెలలు గడిచినా ఇంకా మంత్రివర్గ విస్తరణ చేయకపోవడంపై వారంతా రగిలిపోతున్నారు. కాంగ్రస్ పార్టీ అధిష్ఠానం ఊహించిన దానికంటే ఎక్కువగా అసమ్మతి రగిలే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శలు గుప్పించగా, ఆ జాబితాలో మరో ఎమ్మెల్యే పరోక్షంగా చేరే అవకాశం ఉన్నదని తేలింది.
Congress: మంత్రివర్గ విస్తరణలో తనకు తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందని భావిస్తూ వచ్చిన ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో అసహనం పెరిగి ఏకంగా ఆరోపణలకు దిగారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ప్రేంసాగర్‌రావు, వివేక్, మల్‌రెడ్డి రంగారెడ్డి బహాటంగానే విమర్శలు గుప్పించారు. అధిష్టానానికే హెచ్చరికలు చేసేలా వారి వ్యాఖ్యలు ఉండటంతో ప్రభుత్వం ఉంటుందా? ఊడుతుందా? అన్న ఊగిసలాటకు దారితీసింది.
Congress: ఈ దశలోనే కాంగ్రెస్ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అభిమానులు బహిరంగ విమర్శలకు దిగారు. ఏకంగా బహిరంగ లేఖనే విడుదల చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి, రెడ్డి సామాజిక వర్గ మంత్రులకు శ్రీహరి అభిమానులు ఆ లేఖ ద్వారా హెచ్చికలనే జారీ చేశారు. వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కకపోతే మీ భరతం పడతామని ఘాటు హెచ్చరికలను జారీ చేశారు.
Congress: ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.10 కోట్లు ఇచ్చామని, మంత్రి పదవి కోసం రూ.100 కోట్లు ఖర్చు పెట్టామని ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. తీరా మంత్రి పదవి వచ్చే సమయంలో కొందరు రెడ్డి నేతలు అడ్డుపడుతున్నారంటూ వాకిటి శ్రీహరి అభిమానులు, ముదిరాజ్ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆయన ప్రత్యక్షంగా ఆరోపణలు చేయకున్నా, ఆయన ప్రోద్భలంతోనే ఈ బహిరంగ విమర్శులు చేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.