CJP Protest: దేశ రాజధానిలో ఇటీవల కాలంలో విపరీతమైన సంచలనం సృష్టిస్తున్న యువజన నిరసన బృందం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) సరికొత్త వివాదంలో చిక్కుకుంది. సీజేపీ కీలక నేతల్లో ఒకరైన సౌరవ్ దాస్ నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన తన మొబైల్ ఫోన్ స్క్రీన్‌పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ChatGPT/AI) రూపొందించిన నోట్స్ చూస్తూ మాట్లాడుతున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
దీంతో పాటు, ప్రెస్ మీట్లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేక.. మిమ్మల్ని మోదీ పంపించారా? “మీరు మోదీ మీడియా” అంటూ రిపోర్టర్లపై అసహనం వ్యక్తం చేసిన తీరు కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఫోన్లో ఏఐ టెక్స్ట్ చూస్తూ ప్రసంగం – నెటిజన్ల తీవ్ర ట్రోలింగ్..
ఈ ప్రెస్ మీట్ లైవ్ విజువల్స్‌లో సౌరవ్ దాస్ ముందు ఉన్న మొబైల్ ఫోన్ స్క్రీన్‌పై ఏఐ జనరేట్ చేసిన టెక్స్ట్ , టాపిక్ కి సంబంధించిన కీ పాయింట్లు ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. దింతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాల సమయంలో టెలిప్రాంప్టర్ చూసి చదువుతున్నారని సీజేపీ నేతలు, సోషల్ మీడియా వేదికగా విపక్ష యువత గతంలో తీవ్రంగా ఎద్దేవా చేశారు. ఇప్పుడు స్వయంగా సీజేపీ నేతే ఏఐ నోట్స్, చాట్‌జీపీటీ ప్రాంప్ట్‌లు చూసుకుంటూ మాట్లాడటంపై ప్రధాని మోదీ మద్దతుదారులు, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఇతరులను వేలెత్తి చూపించే ముందు మీ సంగతేంటి?..
ప్రసంగాల కోసం సిద్ధం కావడం తప్పుకాదు కానీ.. ఎదుటివారిపై విమర్శలు చేస్తూ తాము మాత్రం ఏఐ టూల్స్‌ను ఆశ్రయించడం ముమ్మాటికీ ద్వంద్వ వైఖరి (Hypocrisy) అని నెటిజన్లు స్క్రీన్షాట్లతో సహా పోస్టులు పెడుతున్నారు.
రిపోర్టర్లపై ఎదురుదాడి – “మిమ్మల్ని మోదీ పంపించారా?”:
తాజా పరిణామాలు, ఉద్యమ లక్ష్యాలపై విలేకరులు సహేతుకమైన, సూటి ప్రశ్నలు అడగ్గా.. వాటికి సరైన వివరణ ఇవ్వలేక సౌరవ్ దాస్ అసహనానికి గురయ్యారు. ప్రశ్నలకు బదులివ్వాల్సింది పోయి.. “మిమ్మల్ని మోదీ పంపించారా?”, “మీరు మోదీ మీడియా కదా?”, “అసలు మీకు రిపోర్టర్ అంటే అర్థం తెలుసా?” అంటూ ఎదురుదాడికి దిగారు. బాధ్యతాయుతంగా జవాబులు చెప్పకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడటం ప్రజాస్వామ్య ఉద్యమకారులకు తగదంటూ జర్నలిస్టు వర్గాలు, సోషల్ మీడియా యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏమిటీ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నేపథ్యం?
నిరుద్యోగ యువతను ఉద్దేశించి ఒక న్యాయపరమైన వ్యాఖ్యలో “బొద్దింకలు” (Cockroaches) అని సంబోధించారన్న ప్రచారంతో 2026లో ఈ వినూత్న ఉద్యమం పుట్టుకొచ్చింది. వ్యంగ్య ధోరణిలో, వినూత్న నిరసనలతో జెన్-జీ (Gen Z), నిరుద్యోగ యువతను ఆకర్షిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సీఈసీకి వ్యతిరేకంగా, నిరుద్యోగంపై ఈ బృందం ఆందోళనలు చేస్తోంది.
అయితే, జంతర్ మంతర్ వివాదాలు, ఢిల్లీలో ట్రాఫిక్ స్తంభనల నేపథ్యంలో.. తాజా ఏఐ నోట్స్ వివాదం, రిపోర్టర్లపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంతో సీజేపీ తీరుపై సామాన్య ప్రజల్లోనూ విమర్శలు మొదలయ్యాయి.