Niti Taylor: తెలుగులో ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని, హిందీ టెలివిజన్ రంగంలో స్టార్‌గా ఎదిగిన నటి నీతి టేలర్ (Niti Taylor) తన జీవితంలోని అత్యంత చీకటి కోణాలను బయటపెట్టారు. ఇటీవల ‘హాటర్‌ఫ్లై’ (Hauterrfly)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కెరీర్ ఆరంభంలో ఎదురైన భయానక కాస్టింగ్ కౌచ్ అనుభవాలు, పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న మానసిక వేధింపులు, గత ప్రేమ బంధంలో మాజీ ప్రియుడు పెట్టిన శారీరక చిత్రహింసల గురించి ఓపెన్‌గా మాట్లాడి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశారు.
రోల్ కావాలంటే నాతో పడుకోవాలన్నాడు.. సౌత్ డైరెక్టర్‌పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు
కెరీర్ ప్రారంభంలో సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు చేసిన సమయంలో జరిగిన అత్యంత చేదు అనుభవాన్ని నీతి టేలర్ గుర్తు చేసుకున్నారు..
మొదటి సినిమా దర్శకుడే కాల్ చేశాడు..
నేను సౌత్‌లో చేసిన మొదటి సినిమా దర్శకుడే కొన్నాళ్ల తర్వాత మరో ప్రాజెక్ట్ ఉందని నాకు ఫోన్ చేశాడు. అయితే ఆ సినిమాలో అవకాశం కావాలంటే.. ‘ఈసారి నాతో పడుకోవాల్సి ఉంటుంది’ అని నేరుగా అసభ్యకరమైన డిమాండ్ చేశాడు. ఆ మాట వినగానే నాకు నోట మాట రాలేదు, తీవ్రమైన షాక్‌కు గురయ్యాను అని చెప్పారు.
ఏడుస్తూ అమ్మకు ఫోన్ చేసి చెప్పా..
వెంటనే కాల్ కట్ చేసి, అతడి నంబర్ బ్లాక్ చేసేశాను. ఆ తర్వాత ఏడుస్తూ అమ్మకు ఫోన్ చేసి విషయం చెప్పాను. అతడు వయసులో చాలా పెద్దవాడు. ఇతర మహిళలతో కూడా అసభ్యంగా ప్రవర్తించడం నేను చూశాను. కానీ నాతో ఇలా మాట్లాడతాడని అనుకోలేదు. ఆ ఒక్క చేదు ఘటన వల్లే ఇకపై సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకుని, వెండితెరకు దూరమై టీవీ రంగానికి పరిమితమయ్యాను అని వివరించారు.
టాలీవుడ్లో నీతి టేలర్ ప్రయాణం2012లో తనీష్ హీరోగా, దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన యూత్‌ఫుల్ హిట్ చిత్రం ‘మేం వయసుకు వచ్చాం’తో నీతి టేలర్ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ‘దిల్’ అనే ముస్లిం యువతి పాత్రలో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత రాహుల్ రవీంద్రన్ సరసన ‘పెళ్లి పుస్తకం’ (2013), అలాగే ‘లవ్ డాట్ కామ్’ వంటి సినిమాలో నటించారు.
మాజీ ప్రియుడు చెంపదెబ్బలు కొట్టాడు.. సిగరెట్లతో కాల్చాడు..
వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న నరకం గురించి మాట్లాడుతూ నీతి టేలర్ భావోద్వేగానికి లోనయ్యారు. కైసీ యే యారియాన్’ తొలి సీజన్ షూటింగ్ సమయంలో ఒకరితో ప్రేమలో ఉన్నానని, ఆ బంధం ఒక పీడకలలా మారిందని చెప్పారు. “షార్ట్ దుస్తులు వేసుకుంటే జనాలు చూస్తున్నారంటూ తిట్టేవాడు. ఎక్కడికి వెళ్లినా, ఎవరి పక్కన నిలబడినా అనుమానించేవాడు” అని గుర్తు చేసుకున్నారు.
బిల్డింగ్ బయట దాడి – సిగరెట్లతో కాల్చడం..
ఓసారి అతడి బర్త్‌డే పార్టీ వాతావరణం నచ్చక తన స్నేహితురాళ్లతో కలిసి వెళ్లేందుకు వీడ్కోలు చెప్పడానికి వెళ్లగా.. అతడు చేయి పట్టుకుని బయటకు లాగాడని తెలిపారు. “నన్ను బయటకు నెట్టేసి, లాగి చెంపదెబ్బ కొట్టాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ తర్వాత నా బిల్డింగ్ వద్దకు వచ్చి అరుస్తూ.. పార్టీ నుంచి ఎందుకు వచ్చేశావంటూ చేతిలో ఉన్న సిగరెట్లతో నా శరీరంపై కాల్చాడు. నా చర్మానికి కెల్లాయిడ్స్ వచ్చే స్వభావం ఉండటంతో, అతడు పెట్టిన సిగరెట్ వాతల మచ్చలు ఇప్పటికీ నా శరీరంపై చెరిగిపోకుండా ఉన్నాయి” అని తెలిపారు.
నాలుగేళ్ల పాటు బాడీ షేమింగ్:
“నువ్వు చాలా పొట్టిగా ఉంటావు, లావుగా ఉన్నావు, అసలు అందంగానే లేవు అని నాలుగేళ్ల పాటు ప్రతీరోజూ కించపరిచాడు. అతడి కోసం వంట చేయడం, ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం, అతడి తల్లిదండ్రులను బయటకు తీసుకెళ్లడం అన్నీ ప్రేమతో చేశాను. కానీ అతడి మాటల వల్ల నా ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింది. ఇప్పటికీ ఎవరైనా నన్ను అందంగా ఉన్నావని మెచ్చుకుంటే వెంటనే నమ్మలేను అని ఆవేదన వ్యక్తం చేశారు.
బడి రోజుల్లో వేధింపులు – వాష్‌రూమ్‌ల గోడలపై ఫోన్ నంబర్లు..
పాఠశాల రోజులు తన జీవితంలో అత్యంత భయానకమైన రోజులని నీతి తెలిపారు.. మా బడి ఎదురుగా బాయ్స్ స్కూల్ ఉండేది. నా స్నేహితురాళ్ల బాయ్‌ఫ్రెండ్స్ నాకు మెసేజ్‌లు చేసేవారు. నేను వారిని పట్టించుకోకపోవడంతో వారు తట్టుకోలేకపోయారు. దీంతో నా క్యారెక్టర్‌పై అసత్యాలు ప్రచారం చేశారు. నా ల్యాండ్‌లైన్ నంబర్‌ను బస్టాపుల్లో, స్కూల్ వాష్‌రూమ్‌లలో రాసేశారు.
దానివల్ల మా ఇంటికి అసభ్యకరమైన కాల్స్ వచ్చేవి. కొన్నిసార్లు మా అమ్మ ఫోన్ ఎత్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యేది. నాపై వాటర్, ఫుడ్ చల్లుతూ, అసభ్యకరమైన డ్రాయింగ్స్ వేస్తూ తీవ్రంగా ఏడిపించేవారు. రోజూ స్కూల్ బస్సులో ఏడుస్తూ ఇంటికి వెళ్లేదాన్ని. పరీక్షలు ముగిశాక వేరే నగరానికి పంపించేస్తామని అమ్మానాన్న చెప్పడంతో ఆ కష్టాన్ని ఎలాగోలా భరించాను అని పంచుకున్నారు.
‘కైసీ యే యారియాన్’ పార్థ్ సమథాన్ & ‘గులామ్’ వివాదాలు..
కైసీ యే యారియాన్’ మొదటి రెండు సీజన్ల సమయంలో హీరో పార్థ్ సమథాన్‌తో మొదట్లో విభేదాలు ఉండేవని, అయితే తానే స్వయంగా వెళ్లి క్షమాపణలు చెప్పి మాట్లాడటంతో ఇద్దరి మధ్య బంధం మెరుగై ఫ్రెండ్స్‌గా మారినట్లు వెల్లడించారు.
‘గులామ్’ సెట్స్‌లో కో-స్టార్ ఇబ్బందులు..
‘గులామ్’ సీరియల్ సమయంలో తనతో నటించిన సహ నటుడు తనపై అసూయ పెంచుకున్నాడని, ఒకే మేకప్ ఆర్టిస్ట్‌ను తన వద్దకు రానివ్వకుండా తలుపులు వేసుకుని ఇబ్బంది పెట్టేవాడని తెలిపారు. అంతేకాకుండా తనపై లేనిపోని తప్పుడు కథనాలు, పెయిడ్ ఆర్టికల్స్ రాయించారని వాపోయారు.
ఇలా కెరీర్, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా.. హిందీలో ‘కైసీ యే యారియాన్’, ‘గులామ్’, ‘ఇష్క్బాజ్’, ‘బడే అచ్ఛే లగ్తే హైన్ 2’, ‘ఝలక్ దిఖ్లా జా 10’ వంటి పాపులర్ షోలతో అగ్ర నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2020లో తన చిన్ననాటి మిత్రుడు, ఆర్మీ ఆఫీసర్ అంకిత్ బావాను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో నిలదొక్కుకున్నారు.
