DDMS Sivashankar Arrest: లంచం తీసుకుంటూ ప్రభుత్వ అధికారులు పట్టుబడుతున్న ఘటనలు నిత్యం వెలుగుచూస్తున్నప్పటికీ కొందరి తీరు మారడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (DGMS) డిప్యూటీ డైరెక్టర్ లంచం తీసుకుంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు. రూ.2 లక్షల లంచం తీసుకున్న ఆరోపణలపై హైదరాబాద్-III రీజియన్ డీజీఎంఎస్ డిప్యూటీ డైరెక్టర్ (మైనింగ్) యు. శివశంకర్‌తో పాటు ప్రైవేట్ మైనింగ్ సంస్థ ప్రతినిధి, మధ్యవర్తిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
నిందితులను అదుపులోకి తీసుకున్న అనంతరం సీబీఐ బృందాలు రంగంలోకి దిగి హైదరాబాద్ సహా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ముమ్మర సోదాలు నిర్వహించాయి. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో కీలక పత్రాలు, ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
