Vanamahotsavam 2025: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం పచ్చదనం పెంపుదల దిశగా పెద్ద స్థాయిలో చర్యలు ప్రారంభించింది. సోమవారం ఉదయం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనమహోత్సవానికి శ్రీకారం చుట్టనున్నారు.ఈ కార్యక్రమంలో అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, పీసీసీఎఫ్ సువర్ణతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు.
ఈసారి లక్ష్యం భారీగా!
ఈ ఏడాది వనమహోత్సవంలో రాష్ట్రవ్యాప్తంగా 18 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే నర్సరీల్లో పలు రకాల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి.రంగారెడ్డి జిల్లా అత్యధికంగా 89 లక్షల మొక్కలు నాటనుండగా, సిరిసిల్ల జిల్లాకు 10 లక్షల మొక్కలే లక్ష్యంగా పెట్టారు.మున్సిపల్ శాఖకు 8 కోట్ల మొక్కలు, పంచాయతీ రాజ్ శాఖకు 7 కోట్ల మొక్కల బాధ్యతలు అప్పగించారు.హెచ్‌ఎండీఏ పరిధిలో 4.5 కోట్ల మొక్కలు, అటవీశాఖ ద్వారా 1 కోట్ల మొక్కలు నాటనున్నారు.
ఒక విద్యార్థి… ఒక మొక్క!
ఈ వనమహోత్సవంలో విద్యార్థుల పాత్ర ఎంతో ముఖ్యమైనది.స్కూళ్లు, కాలేజీల్లోని విద్యార్థులను ప్రోత్సహిస్తూ ‘ఒక విద్యార్థి – ఒక మొక్క’ నినాదంతో ముందుకు సాగనున్నారు.వీళ్ల కోసం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు.విద్యార్థులను ‘గ్రీన్ అంబాసిడర్లుగా’ తయారుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రతి ఇంటికీ మొక్కలు… ప్రతి వాడకూ పచ్చదనం!
ఈసారి వనమహోత్సవం ప్రత్యేకత ఏంటంటే… ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ చేయనున్నారు.అధికారుల ప్రత్యేక బృందాలు మొక్కల నాటడం, వాటి సంరక్షణను పర్యవేక్షిస్తాయి.వర్షాకాలం చివరినాటికి రాష్ట్రం అంతా పచ్చగా మారడమే లక్ష్యం.