Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణతో పాటు మహిళల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారు. ఇటీవల రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వనమహోత్సవం-2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రుద్రాక్ష మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి కొండా సురేఖ, సీఎంసలహాదారు నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడా పాల్గొన్నారు.
18 కోట్ల మొక్కల లక్ష్యం!
ఈ ఏడాది మొత్తం 18 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది.“వనమే మనం… మనమే వనం’’ అని పెద్దలు చెప్పిన మాటలను గుర్తు చేశారు సీఎం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.
“అమ్మ పేరుతో మొక్క నాటండి, పిల్లల పేరుతో మొక్కలు పెంచండి” అంటూ పిలుపునిచ్చారు సీఎం రేవంత్. ప్రతి ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటి వాటిని పిల్లల్లా చూసుకోవాలని ఆయన సూచించారు.
మహిళా సాధికారతకు ప్రభుత్వం వెన్నుతన్ను
పచ్చదనం పాటు మహిళలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం స్పష్టంచేశారు.
- సోలార్ ప్లాంట్లు, పాఠశాలలు మహిళలకే: సోలార్ ప్లాంట్ల నిర్వహణ, పాఠశాలల నిర్వహణ బాధ్యతలను మహిళలకు అప్పగించామన్నారు.
- ఆర్టీసీ బస్సులకు మహిళలే యజమానులు: ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో పాటు, వెయ్యి బస్సులను మహిళా సంఘాల పేరుతో అద్దెకిచ్చామని చెప్పారు. దీంతో మహిళలు ఆర్థికంగా బలపడతారని వివరించారు.
- మహిళల వస్తువులకు ప్రత్యేక మార్కెట్ సదుపాయం: హైటెక్ సిటీ పరిధిలోని పెద్ద కంపెనీలు ఉండే ప్రాంతాల్లో మహిళల తయారీ వస్తువులకు ప్రత్యేకంగా మార్కెట్ ఏర్పాటు చేశామన్నారు.
మహిళలకు కోటీశ్వరుల భవిష్యత్!
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలని ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. ఇప్పటికే మహిళా సంఘాలకు ₹21 వేల కోట్ల రుణాలు ఇచ్చినట్లు చెప్పారు.
వెనుకబడిన మహిళలకు ముందడుగు
‘‘ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు గౌరవంగా బ్రతకాలి’’ అనే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మహిళలకు 60 అసెంబ్లీ టికెట్లు
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 60 ఎమ్మెల్యే సీట్లు మహిళలకే కేటాయిస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.ఇప్పటికే 51 సీట్లు మహిళలకు కేటాయించగా, మరో 9 సీట్లు అదనంగా ఇస్తామని చెప్పారు.
దిల్లీకి వెళ్ళనున్న సీఎం
వనమహోత్సవం ముగిశాక ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్, రాష్ట్ర ప్రాజెక్టుల కోసం కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆర్ఆర్ఆర్, మూసీ నది పునరుజ్జీవనం, మెట్రో విస్తరణ కోసం నిధులు కోరనున్నారు.