CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కర్నూలు జిల్లాలో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం, శుభ్రతపై దృష్టిసారిస్తూ ఆయన పర్యటనను ప్రారంభించారు.
ఉదయం 11:25 గంటలకు సీఎం గారు కర్నూలు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత రోడ్డు మార్గంలో సీ క్యాంపు రైతు బజారుకు చేరుకుని, అక్కడ జరుగుతున్న కూరగాయల వ్యర్థాలను ఎరువుగా మార్చే ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. అనంతరం రైతులు, పారిశుధ్య కార్మికులతో ముఖాముఖి చర్చలు జరిపారు.
ఈ కార్యక్రమం అనంతరం జైరాజ్ స్టీల్ స్వచ్ఛాంధ్ర పార్క్‌కు శంకుస్థాపన చేశారు. స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా రూపొందిస్తున్న ఈ పార్క్, స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా నిర్మించబడుతోంది. దాదాపు మధ్యాహ్నం 12:55 గంటలకు కేంద్రీయ విద్యాలయం సమీపంలోని ప్రజావేదికకు ముఖ్యమంత్రి చేరుకుని స్థానికులతో ముచ్చటించారు.
బహిరంగ సభలో ప్రసంగం – టీడీపీ నాయకులకు అభినందనలు
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించి, రాష్ట్రాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, పార్టీ శ్రేణులు తమ సేవా ధోరణిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించిన వారికి అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత ప్రభావవంతంగా తీసుకెళ్లే విధానంపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
తర్వాత 5:35 గంటలకు సీఎం గారు తిరిగి కర్నూలు విమానాశ్రయానికి చేరుకుని, హైదరాబాద్‌కు పయనమయ్యారు.
స్వచ్ఛతకు ప్రాధాన్యత – ప్రజలకోసం సీఎం నడుం కట్టారు
ఈ పర్యటనలో చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై దృష్టిసారించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పథకం ద్వారా రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా, ప్రజల్లో శుభ్రతపై అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ, అభివృద్ధి ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లే చంద్రబాబు ఈ పర్యటన ద్వారా మరోసారి తన పని తీరును చాటిచెప్పారు.