Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించినా.. రౌడీయిజం, గూండాయిజం, సంఘవిద్రోహ శక్తులను ప్రోత్సహించినా ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని (వైసీపీ) తీవ్రస్థాయిలో హెచ్చరించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో గురువారం నిర్వహించిన ‘మీ భూమి… మీ హక్కు’ అనే ప్రత్యేక కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అక్కడ అప్పలాపురం, కాపులపల్లి గ్రామాలకు చెందిన రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ.. రాయలసీమలో కొందరు రక్తచరిత్ర రాస్తే, తాను మాత్రం పరిశ్రమలు తెచ్చి ‘రతనాల సీమ’గా కొత్త చరిత్ర లిఖించబోతున్నానని ప్రకటించారు.
గత వైసీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల(డ్రగ్స్) సంస్కృతిని పెంచారని, ఇప్పుడేమో బ్లేడు బ్యాచులు, రౌడీలను ఆ పార్టీ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వంలో రాముడి విగ్రహం తల తొలగించినా, అంతర్వేది రథం తగలబెట్టినా, దుర్గగుడిలో వెండి సింహాలు మాయమైనా కనీసం ఒక్క చర్య కూడా తీసుకోలేదని మండిపడ్డారు. హిందూ పురాణాలను, దేవుళ్లను దూషించిన ‘రావణ్’ లాంటి యూట్యూబర్లకు వైసీపీ ఆర్థిక సాయం చేస్తూ వెనకేసుకురావడం వారి బరితెగింపునకు నిదర్శనమన్నారు. జగన్ మోహన్ రెడ్డి తిరుమల వస్తే డిక్లరేషన్ ఇవ్వరని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వంలో దేవాలయాలను ప్రక్షాళన చేస్తున్నామని, రౌడీలు ఆడబిడ్డల జోలికొస్తే వారికదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఎంతో కాలంగా లక్షలాది మందిని ఇబ్బంది పెడుతున్న భూ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. దళారీలు లేకుండా నేరుగా రైతులకే హక్కులు కల్పించేలా గ్రామసభలు పెట్టి ఆధునిక పాసు పుస్తకాలు ఇస్తున్నట్లు తెలిపారు. 2027 మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 72.07 లక్షల పాసు పుస్తకాలను పంపిణీ చేయడమే తన లక్ష్యమని, ఇప్పటివరకు 29.04 లక్షల పుస్తకాలు అందజేశామని చెప్పారు. అలాగే, ఒకప్పుడు కరవు సీమగా ఉన్న రాయలసీమ ఇప్పుడు ‘రైజింగ్ రాయలసీమ’గా మారుతోందన్నారు. ఓర్వకల్లు, కొప్పర్తిలలో ఇండస్ట్రియల్ టౌన్షిప్లు, పుట్టపర్తిలో ఫైటర్ జెట్ల తయారీ, కుప్పంలో అడిడాస్, తిరుపతిలో స్పేస్ సిటీ వంటి భారీ ప్రాజెక్టులతో రాయలసీమకు పారిశ్రామికంగా పూర్వవైభవం తెస్తున్నామని భరోసా ఇచ్చారు.
ఇదే సమయంలో వాతావరణ పరిస్థితులపై మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ‘ఎల్నినో’ ప్రభావం తీవ్రంగా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదన్నారు. గత ఏడాదితో పోలిస్తే జలాశయాల్లో నీటి నిల్వలు 57 శాతం నుండి 37 శాతానికి పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించేలా ప్రతి ఒక్కరూ జల సంరక్షణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సభ జరుగుతుండగా కొందరు మహిళలు తమ వ్యక్తిగత సమస్యలపై ప్లకార్డులు ప్రదర్శించడంపై సీఎం కొంత అసహనం వ్యక్తం చేశారు. బహిరంగ సభలకు వచ్చి ఇలా గందరగోళం సృష్టించడం మన సంస్కృతి కాదని, సమస్యలు ఉంటే అధికారులకు వినతిపత్రాలు ఇస్తే కచ్చితంగా పరిష్కరిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.
