చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ లో.. భారత్ లో అత్యంత విజయవంతమైన నటుడిగా ప్రపంచ రికార్డ్!

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఆయన చూడని అవార్డులు.. గెలుచుకొని రివార్డులు లేవు. అయితే, ఇప్పుడు చిరంజీవి కీర్తి కిరీటంలో మరో అద్భుత గౌరవం వచ్చి చేరింది. మెగాస్టార్ చిరంజీవి పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరింది. 45 ఏళ్ల కెరీర్‌లో 156 సినిమాల్లోని 537 పాటల్లో 24 వేల డ్యాన్స్‌ మూమెంట్స్ ల ప్రదర్శనకు ఈ గౌరవం అందుకున్నారు.   భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన సినీ నటుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు అయింది. సెప్టెంబర్ 22న ఆయన అధికారికంగా ఈ గౌరవాన్ని అందుకున్నారు. చిరంజీవి పేరు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చేరడం పట్ల భారతదేశంలోని ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

హైదరాబాద్ లో జరిగిన ఒక ఈవెంట్ లో ఆదివారం (సెప్టెంబర్ 22) బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్, గిన్నిస్ బుక్ ప్రతినిధి రిచర్డ్స్ చేతుల మీదుగా అగిన్నీస్ రికార్డ్ సర్టిఫికెట్ అందుకున్నారు చిరంజీవి. ఈ వేడుకకు చిరంజీవితో సినిమాలు నిర్మించిన తమ్మారెడ్డి భరద్వాజ్, అల్లు అరవింద్, జెమిని కిరణ్, అశ్వనీదత్, కెఎస్ రామారావు ఇతర నిర్మాతలు, అలాగే దర్శకులు రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, బాబీ, వశిష్ట హాజరయ్యారు. 

ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. చిరంజీవి డ్యాన్స్ చూస్తే అసలు కళ్ళు తిప్పుకోలేం. చిరంజీవి ప్రత్యేకత ఏమిటంటే ఆయన డాన్స్ ఎదో కొరియోగ్రాఫర్ చెప్పాడు కాబట్టి చేయరు. మనసు పెట్టి.. తానూ ఎంజాయ్ చేస్తూ చేస్తారు. అందుకే ఆయన డాన్స్ మూమెంట్స్ అంత పెర్ఫెక్ట్ గా ఉంటాయి. చిరంజీవికి నేను పెద్ద ఫ్యాన్. అంతేకాదు ఆయన మా పెద్దన్నయ్య లాంటి వారు అంటూ చెప్పారు. 

గిన్నిస్ బుక్ ప్రతినిధి రిచర్డ్స్ మాట్లాడుతూ.. చిరంజీవి చేసినన్ని డ్యాన్స్ మూమెంట్స్ ప్రపంచంలో మరే నటుడూ చేయలేదు. గిన్నిస్ బుక్ నుంచి ఈ ప్రత్యేకతను గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్స్ లో చేర్చడం జరిగింది అని చెప్పారు. అంతేకాకుండా, చిరంజీవి 1955 ఆగస్టులో పుట్టారు. గిన్నిస్ బుక్ కూడా 1955 ఆగస్టులోనే ప్రారంభం అయింది. ఇది నిజంగా చెప్పుకోదగ్గ విషయం అంటూ రిచర్డ్స్ పేర్కొన్నారు. 

ALSO READ  Samudrudu Pre Release: వచ్చిన కలెక్షన్స్ నుంచి 20 శాతం మత్స్యకారులకు.. సముద్రుడు మూవీ టీమ్

తన గిన్నిస్ రికార్డ్  గురించి చిరంజీవి ఏమన్నారంటే . . 

గిన్నిస్ బుక్ లో తన పేరు చేరడంపై చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే.. అసలు ఇలాంటి రికార్డు ఒకటి ఉంటుందని.. అది తనకు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. తన నటనకు డ్యాన్స్ లు మరింత క్రేజ్ తీసుకువచ్చాయన్నారు. చిన్నతనంలో రేడియోలో పాటలు వింటూ ఇంటి దగ్గర సరదాగా చేసే డ్యాన్సుల నుంచి క్రమంగా సినిమాల్లో కూడా డ్యాన్సులతోనే ప్రేక్షకులకు బాగా దగ్గర కాగలిగానని చెప్పారు. తన నిర్మాతలు, దర్శకులు తన డ్యాన్స్ కోసమే ప్రత్యేకంగా అవసరం లేకపోయినా సినిమాలో పాటలను ఇరికించిన సందర్భాలు చాలా ఉన్నాయన్నారు. నా సినిమా అంటే కచ్చితంగా 6 పాటలు ఉండాలని అశ్వనీదత్ పట్టు పెట్టేవారని చెప్పారు. తనకు సినిమాల్లో ఇన్ని పాటలు.. ఇన్ని డ్యాన్సులు చేసే అవకాశం కల్పించిన నిర్మాత, దర్శకులు అందరికీ చిరంజీవి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *