Viral News: ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో ఆకాశం ఒక్కసారిగా రక్తవర్ణంలోకి మారిపోవడం స్థానికులను తీవ్ర ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేసింది. ఆంధ్రప్రదేశ్ తీరంలో తీరం దాటి బలహీనపడిన ‘అర్నబ్’ తుఫాన్ అవశేషాలు మధ్య భారతదేశం వైపు కదులుతున్న సమయంలో ఈ వింత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆకాశం రక్తపు రంగులోకి మారిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో.. తుఫాన్ ప్రభావం వల్లే ఇలా జరిగిందా లేక మరేదైనా వింత కారణం ఉందా అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
నిపుణులు, వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం.. తుఫాన్ తెచ్చిన వాతావరణ పరిస్థితులు దీనికి దోహదం చేసి ఉండవచ్చని చెబుతున్నారు. సాధారణంగా సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో సూర్యకాంతి వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తక్కువ తరంగదైర్ఘ్యం (Wavelength) కలిగిన నీలిరంగు కాంతి చెల్లాచెదురైపోయి, ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న ఎరుపు, నారింజ రంగు కిరణాలు మాత్రమే మన కళ్లను చేరుతాయి.
దీన్ని ‘రైలీ స్కాటరింగ్’ (Rayleigh scattering) అంటారు. తుఫాన్ కారణంగా వాతావరణంలో తేమ శాతం విపరీతంగా పెరగడం, దుమ్ము రేణువులు, దట్టమైన మేఘాల పొరలు కాంతిని అసాధారణ రీతిలో పరావర్తనం చెందించడం వల్లనే ఆకాశం అంతటి భయంకరమైన ఎరుపు రంగులో కనిపించి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఆ సమయంలోని ఖచ్చితమైన వాతావరణ అంశాలను మరింత లోతుగా విశ్లేషించాల్సి ఉంది.
ఓవైపు ఈ వింత రంగు దృశ్యం అందరినీ ఆకట్టుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పెనుగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో, కొన్నిచోట్ల ఏకంగా 90 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల ధాటికి చెట్లు నేలమట్టం కావడం, బలహీనమైన నిర్మాణాలు దెబ్బతినడం, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడం జరుగుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, అధికారిక వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
