Chandrababu

Chandrababu: అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన ‘అర్నబ్’ తుఫాన్ సృష్టించిన నష్టాన్ని స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరారు. రాజధాని అమరావతి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం.. తుఫాన్ తీవ్ర ప్రభావానికి గురైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చేయ్యేరు ప్రాంతానికి చేరుకోనున్నారు. వరద ముంపు, ఈదురుగాలుల ధాటికి వేల ఎకరాల్లో నీట మునిగిన పంట పొలాలను ఆయన స్వయంగా ఏరియల్ వ్యూ (వైమానిక సర్వే) ద్వారా పరిశీలిస్తున్నారు.

కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల పరిధిలోని నిమ్మకూరు, పామర్రు, బంటుమిల్లి, నరసాపురం, పాలకొల్లు, అమలాపురం, కాట్రేనికోన ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాలను ఆకాశమార్గం ద్వారా సీఎం క్షుణ్ణంగా సమీక్షించనున్నారు.
అనంతరం వేట్లపాలెంలో క్షేత్రస్థాయికి వెళ్లి తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. పంట చేతికొచ్చే సమయంలో నీట మునగడంతో రైతులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను స్వయంగా అడిగి తెలుసుకుని వారికి భరోసా కల్పించనున్నారు.
దీనితో పాటు గచ్చకాయలపొర వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న తుఫాన్ బాధితులతో స్వయంగా మాట్లాడి, వారికి అందుతున్న ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలను స్వయంగా తనిఖీ చేయనున్నారు. బాధితులకు ఎలాంటి లోటు రాకుండా అన్ని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించిన సీఎం, క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా రైతులకు తక్షణ పరిహారం, సహాయం అందించే దిశగా చర్యలు చేపట్టనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *