Chandrababu: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ రెబల్స్ వ్యవహారంపై అత్యంత కీలకమైన రాజకీయ చర్చ జరిగింది. ఎజెండాలోని అధికారిక అంశాలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంత్రులతో ఎన్నికల కార్యాచరణపై విస్తృతంగా సమీక్షించారు.
కూటమి ధర్మాన్ని ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించి తీరాలని, పొత్తు నియమాలను ఉల్లంఘించే వారి విషయంలో ఎలాంటి మొహమాటాలకు తావులేదని సీఎం చంద్రబాబు అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు.
పార్టీ నిర్ణయాలను ధిక్కరించి స్వతంత్రంగా లేదా రెబల్స్‌గా నామినేషన్లు వేసిన వారిని తక్షణమే పార్టీల నుంచి సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తాము ఖరారు చేసిన కూటమి అధికారిక అభ్యర్థే ఫైనల్ అని, అలాంటి వారిని ఓడించేందుకు ప్రయత్నించే విచ్ఛిన్నకర శక్తులు కూటమికి అవసరం లేదని తేల్చిచెప్పారు. “పవన్ కల్యాణ్, నేను, బీజేపీ నేత మాధవ్ కూర్చొని ఎంతో సఖ్యతతో, పక్కాగా సీట్ల సర్దుబాటు పూర్తి చేశాం.
వ్యక్తిగత అభ్యర్థిని చూసి కాకుండా.. ఎన్డీఏ కూటమి అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓటేయాలని ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చాం” అని చంద్రబాబు పేర్కొన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పూర్తి బాధ్యత తీసుకుని కూటమి అభ్యర్థుల విజయానికి గట్టిగా కృషి చేయాలని ఆదేశించారు.
ఇటీవల తాము నిర్వహించిన ఉమ్మడి మీడియా సమావేశం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం పక్కాగా ఉందని, క్షేత్రస్థాయిలో వచ్చే చిన్న చిన్న సమస్యలను కూడా ఎంతో శ్రద్ధతో ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు.
మూడు పార్టీల శ్రేణులు ఏకతాటిపై నిలిచి అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ స్థానిక ఎన్నికలు ముగిసిన వెంటనే పంచాయతీ, సొసైటీ ఎన్నికలపై దృష్టి పెట్టాలని, ఆ తర్వాత పూర్తిస్థాయి పాలన, ప్రజా సంక్షేమంపై దృష్టి సారిద్దామని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
