Gyanesh Kumar: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని విపక్ష ‘ఇండియా’ (INDIA) కూటమి పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్తోంది. వీధుల్లో నిరసనల నుంచి అడుగు ముందుకేసి.. పార్లమెంట్ తరహా వాతావరణాన్ని తలపించేలా ఒక సరికొత్త రాజకీయ వేదికను సిద్ధం చేస్తోంది. ఢిల్లీలోని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో అక్టోబర్ 30న ఈ వినూత్న కార్యక్రమం జరగనుంది. దీనికి ‘పబ్లిక్ ఇంపీచ్మెంట్’ (ప్రజా మహాభియోగం) అని పేరు పెట్టారు. సుమారు 150 నుంచి 200 మంది ఎంపీలు, సివిల్ సొసైటీ ప్రతినిధులు ఈ సభకు హాజరుకానున్నారు.
ఖర్గే నివాసం వేదికగా.. మధ్యాహ్నం 3:30కి ప్రారంభం
మొదట ఈ కార్యక్రమాన్ని ఇతర బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించాలని భావించినా, అనుమతులు లభించలేదని కాంగ్రెస్ ఆరోపించింది. దీంతో ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్‌లో ఉన్న ఖర్గే అధికారిక నివాసాన్నే వేదికగా ఖరారు చేశారు.
ఈ వేదికపై భారీ టెంట్, ప్రత్యేక లైటింగ్, దేశవ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ ఇచ్చేందుకు మల్టీ-కెమెరా సెటప్‌ను ఏర్పాటు చేశారు.ఈ మొత్తం ఈవెంట్ నిర్వహణ బాధ్యతలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్యవేక్షిస్తున్నారు.కార్యక్రమం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
ఎలా జరగబోతోంది? మీరా కుమార్ అధ్యక్షతన ‘చార్జ్‌షీట్’
ఈ కార్యక్రమాన్ని ‘మాక్ పార్లమెంట్’ (నకిలీ పార్లమెంట్) లేదా ‘మాక్ కోర్టు’గా నిర్వహిస్తే పార్లమెంట్‌ను, న్యాయవ్యవస్థను కించపరిచినట్లు అవుతుందన్న విమర్శలు రాకుండా విపక్షాలు పక్కా ప్లాన్ చేశాయి.
అధ్యక్షత: లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు.
సివిల్ సొసైటీ & బాధితులు: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో ఓట్లు కోల్పోయిన బాధితులు, పౌర సమాజ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు.
చార్జ్‌షీట్ & తీర్మానం: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్వయంగా సీఈసీకి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఎన్నికల సంఘంపై సిద్ధం చేసిన ‘పబ్లిక్ చార్జ్‌షీట్’ను చదివి వినిపిస్తారు.
ప్రసంగాలు: కూటమిలోని ప్రతి పార్టీ నుంచి ఒక ప్రతినిధి ప్రసంగించనుండగా, కార్యక్రమం ముగింపులో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక ఉపన్యాసం చేయనున్నారు.
రాజ్యాంగబద్ధంగా సీఈసీని తొలగించవచ్చా?
ఈ పబ్లిక్ ఇంపీచ్మెంట్ అనేది కేవలం ప్రజల్లో అవగాహన, రాజకీయ ఒత్తిడి పెంచేందుకు ఉద్దేశించిన కార్యక్రమం మాత్రమే. రాజ్యాంగపరంగా దీని ద్వారా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పదవి నుంచి తొలగించడం సాధ్యం కాదు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఏ ప్రక్రియ ద్వారా అయితే తొలగిస్తారో, సీఈసీని కూడా అదే విధంగా పార్లమెంట్‌లోని ఉభయ సభల ఆమోదంతో (ప్రత్యేక మెజారిటీతో) రాష్ట్రపతి మాత్రమే తొలగించగలరు. ఈ లాంఛనప్రాయ పార్లమెంటరీ ప్రక్రియ లేకుండా సీఈసీని తొలగించే అవకాశం లేదు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR), ఓట్ల తొలగింపు వంటి అంశాలపై ఎన్నికల సంఘం నిష్పాక్షికతను ప్రశ్నిస్తూ, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు విపక్ష కూటమి ఈ ‘ప్రజా మహాభియోగ’ వేదికను ప్రధాన అస్త్రంగా ఎంచుకుంది.
