Chandrababu: ఏపీలో ఇసుక కొరతపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఇసుక సరఫరాపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇసుక లభ్యతపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు నేపథ్యంలో సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. వ్యక్తిగత అవసరాల కోసం ఇసుక తీసుకెళ్లే వారిని ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు.రాష్ట్రంలో ఇసుక డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా సరఫరా పెంచాలని ఆదేశించారు. ఇసుక రీచ్‌లలో స్వయంగా ఇసుక తవ్వి తీసుకెళ్లేందుకు అనుమతించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఇసుకపై ఖర్చు తగ్గేలా రవాణా, తవ్వకం వ్యయం అతి తక్కువగా ఉండేలా చూడాలన్నారు.ఇసుక సరఫరాపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేలా ఆర్టీజీఎస్ ద్వారా ఐవీఆర్ఎస్ కాల్స్ చేయాల్సిందిగా సీఎం ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. సర్వియలెన్స్ కెమెరాలతో అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు నడపాలన్నారు.ఇసుక రీచ్ లలో పూర్తిస్థాయిలో ఇసుక తవ్వకాలపై చర్యలు చేపట్టాలని జిల్లాస్థాయి శాండ్ కమిటీలు, అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్రంలో ఇసుక ధరల్ని కంట్రోల్ చేసేందుకు జిల్లా స్థాయిలో ధరలను మరల సమీక్షించాలని ఆదేశించారు.ఇసుక రీచ్ ల వద్ద తవ్వకం కోసం నిర్దేశించిన రుసుము మాత్రమే కస్టమర్ల నుంచి వసూలు చేయాల్సిందిగా తెలిపారు. ఈ అంశంలో ఫిర్యాదులు వస్తే సహించబోమన్నారు.పోలీసులు జిల్లాల్లో జరిగే ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం దృష్టి పెట్టి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.