Chandrababu: గతంలో హైదరాబాదులో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు హైటెక్ సిటీ తీసుకువచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు.భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని, డీప్ టెక్నాలజీతో కలిగే అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ దిశగా అమరావతిలో డీప్ టెక్నాలజీ భవనం నిర్మిస్తున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఐటీ కంపెనీలు, ఐటీ డెవలపర్లకు ఇచ్చే ప్రోత్సాహకాల గురించి కూడా సమీక్ష సందర్భంగా అధికారులతో చంద్రబాబు చర్చించారు.
అనుమతుల కోసం సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. స్టార్టప్ పాలసీ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు నిర్వహించే స్టార్టప్‌లకు 25 లక్షల వరకూ సీడ్ ఫండింగ్ ఇస్తామన్న ముఖ్యమంత్రి.. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లను ఐఐటీలతో అనుసంధానం చేసే దిశగానూ చంద్రబాబు నాయుడు అధికారులకు సూచనలు చేశారు.
హైదరాబాద్ నగరానికి హైటెక్ సిటీ ఎలా వన్నె తెచ్చిందో అందరికీ తెలిసిందే. అయితే, ఏపీ రాజధాని అమరావతిలోనూ హైటెక్ సిటీ తరహాలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ బిల్డింగ్ నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.