TFDA

TFDA: దర్శకులకు ‘వరం’.. రూ. 30 కోట్లతో 10 సినిమాలు.. చదలవాడ శ్రీనివాసరావు సంచలన ప్రకటన!

TFDA: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉపాధి కరువుతో అల్లాడుతున్న దర్శకులకు అండగా నిలిచేందుకు ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDA) ఆధ్వర్యంలో సుమారు 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో 10 సినిమాలను నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు సోమవారం సోమవారం నాడు టీఎఫ్‌డీఏ మీడియా సమావేశాన్ని నిర్వహించింది.

విద్య, వైద్యం, ఉపాధి.. మా లక్ష్యం: వి.ఎన్. ఆదిత్య

టీఎఫ్‌డీఏ అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన తమ కమిటీ సభ్యుల సంక్షేమం కోసం పని చేస్తోందని తెలిపారు. “నిర్మాతలు ఉంటేనే దర్శకులు ఉంటారు. టాలెంట్ ఉండి కూడా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మా అసోసియేషన్ మెంబర్లకు చదలవాడ గారు ఈ అవకాశం ఇవ్వడం ఒక వరం. దీని ద్వారా 10 మంది దర్శకులతో పాటు వందలాది మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు ఉపాధి దొరుకుతుంది. ఈ సినిమాల ద్వారా వచ్చే లాభాలను కూడా మా యూనియన్‌కే ఇస్తానని ఆయన చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం” అని కొనియాడారు.

నాణ్యమైన సినిమాలు.. క్రమశిక్షణతో కూడిన మేకింగ్

నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, పరిశ్రమలో ప్రస్తుతం థియేటర్లు తగ్గుతున్నాయని, సత్తా ఉన్న దర్శకులకు అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. “నాకు ఆడంబరాలు ఇష్టం లేదు, కానీ దర్శకులకు అండగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. మంచి కథలు, విలువలతో కూడిన కమర్షియల్ సినిమాలు రావాలి. ఉదయం ఏడు గంటలకే షాట్ తీసే క్రమశిక్షణ ఉండాలి. ఈ సినిమాల ద్వారా కొత్త దర్శకులు, ఆర్టిస్టులు ఇండస్ట్రీలో నిలబడితే నాకు అదే సంతోషం” అని ఆయన ఆకాంక్షించారు.

కథల ఎంపిక కోసం ప్రత్యేక కమిటీ

ఈ 10 సినిమాల కోసం టీఎఫ్‌డీఏ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సీనియర్ దర్శకులు అజయ్ కుమార్, ప్రసన్న కుమార్ వంటి వారు ఈ కమిటీలో కీలకంగా వ్యవహరిస్తూ, అసోసియేషన్ మెంబర్లు పంపే స్క్రిప్టులను ఫిల్టర్ చేస్తారు.

  • సాయి రాజేష్ (ట్రెజరర్): “ఉగాది నాడు చదలవాడ గారు దేవుడి రూపంలో వచ్చి మాకు ఈ వరమిచ్చారు. అత్యుత్తమ కథలను ఎంచుకుని, లాభాలను యూనియన్‌కు తెచ్చిపెడతాం” అని హామీ ఇచ్చారు.

  • నవీన్ మేడారం: తక్కువ బడ్జెట్‌లో నాణ్యమైన సినిమాలు తీయడం సాధ్యమేనని, ఈ అవకాశాన్ని దర్శకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కరోనా కష్టకాలంలోనూ అండగా..

గతంలో కరోనా సమయంలో సినీ కార్మికులకు ఆర్థిక సాయం చేయడమే కాకుండా, జర్నలిస్టులకు 100 ఫ్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చిన చదలవాడ శ్రీనివాసరావు గారిని ఇండస్ట్రీ కాపాడుకోవాలని డైరెక్టర్ ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. దర్శకులు సముద్ర, అజయ్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొని చదలవాడ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *