Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ మొదలయ్యేందుకు గట్టిగా వారం రోజులు కూడా లేదు. అయితే పాకిస్తాన్ ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నమెంట్ ను సక్రమంగా నిర్వహిస్తుందా లేదా అన్న విషయంపై ఇప్పటికీ పూర్తి స్పష్టత రాలేదు. వారి మైదానాల్లో ఉండే వసతుల దగ్గర నుండి స్టేడియం నిర్మాణాలు, ఫ్లడ్ లైట్ల అమరణ వరకు అన్నింటిపై ఎంతోమంది తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అటు క్రికెట్ బోర్డులతో పాటు ఇటు ప్లేయర్లకు కూడా ఎన్నో అనుమానాలు ఉండడం గమనార్హం.
తాజాగా పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ముక్కోణపు సిరీస్ లో న్యూజిలాండ్ ఓపెనర్ ప్లేయర్ రచిన్ రవీంద్ర గాయం పాలైన విషయం తెలిసిందే. తన వైపు గాల్లో నేరుగా వస్తున్న బంతిని పట్టుకోవడానికి వెళ్లిన రవీంద్ర తలకు బంతి గట్టిగా తగిలి అక్కడికక్కడే రక్తం కారింది. అసలు ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ అలాంటి సులువైన బంతిని పట్టుకోలేక తలకు తగలడం ఏంటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అయితే నిదానంగా వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే… రవీంద్ర అసలు బంతిని క్యాచ్ పట్టుకోవడానికి చేతులు కూడా పెట్టలేదు. అతను బంతి కోసం పరిగెడుతున్న సమయంలోనే ఫ్లడ్ లైట్ల లోని వెలుగు నేరుగా అతని కళ్ళను తాకింది. దీనితో బంతి గమనాన్ని అంచనా వేయలేకపోయాడు. ఇక అతను వైపే దూసుకొచ్చిన బంతి తలకు గట్టిగా తగలడంతో వెంటనే రక్తం కారింది.
రవీంద్ర ను హుటాహుటిన మెడికల్ పరీక్షలకు పంపారు. ప్రస్తుతానికి పెద్ద ప్రమాదం ఏమీ లేకపోయినా రాబోయే టోర్నమెంట్ లో కనుక ఇలాంటి పరిస్థితులు పునరావృతం అయితే పాకిస్తాన్ కు ఐసీసీ నుండి చివాట్లు తప్పవు. కనీసం ఫ్లేడ్ లైట్లు ఎలాంటి ఎత్తులో బిగించాలి…? అవి ఏ యాంగిల్ లో ఉండాలి…. అన్న విషయంపై కూడా అవగాహన లేకపోవడం నిజంగా పేలవం.
కాసేపు ఈ ఫ్లడ్ లైట్ల విషయం పక్కన పెడితే… కొన్ని స్టేడియంలు అయితే ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. గ్రౌండ్లో అవుట్ ఫీల్డ్ పైన కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఫీల్డింగ్ చేసే సమయంలో ప్లేయర్లు జారిపడినా… తట్టుకొని పడినా… వారి కెరీర్ కే ఇబ్బంది తెచ్చే గాయాలు అవుతుంటాయి. మరి పాకిస్తాన్ ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తుందో ఎవరికి అంత చిక్కడం లేదు.
పైగా భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాకిస్తాన్ వెళ్లడం లేదు. దుబాయి ను తమ వేదికగా ఎంచుకుంది. ఇలాంటి సమయంలో వారు ప్రపంచానికి తాము సమర్థవంతంగా ఒక అంతర్జాతీయ టోర్నీ నిర్వహించగలమని నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ వారి ఏర్పాట్లు మాత్రం ఆ స్థాయిలో లేవు. మరి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇకనైనా పరిస్థితిని సీరియస్ గా తీసుకొని అందుకు తగిన చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.