Cabinet Expansion: తెలంగాణ మంత్రిమండలి విస్తరణ అంశం.. అదిగో పులి, ఇదిగో పులి మాదిరిగా అయింది. ఏడాది నుంచి ఊరిస్తూ వస్తుండగా, ఈ సంక్రాంతికి విస్తరణ కచ్చితంగా ఉంటుందని అందరూ భావించారు. అటు కాంగ్రెస్ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొన్నది. కానీ, ఈ సంక్రాంతికి కూడా లేనట్టేనని తేలిపోయింది. అసలు ఇప్పట్లో అంటే ఈ అర్ధసంవత్సరంలోనే ఉండే అవకాశం లేదని తెలుస్తున్నది.
Cabinet Expansion: వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది గడిచిన సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రుల ప్రకటన ఉంటుందని అందరూ భావించారు. అంతకు ముందే అధిష్ఠానంతో చర్చలు, విస్తరణ అంశాలపై సీఎం, ఇతర ముఖ్య నేతలైన ఉత్తమ్, భట్టి చర్చించినట్టు ప్రచారం జరిగింది. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం ఈ అంశాన్ని పెండింగ్‌లో పెడుతూ వస్తున్నది.
Cabinet Expansion: ఈ సంక్రాంతి పర్వదినాన మంత్రి వర్గ విస్తరణ ఖాయమని అందరూ భావించారు. ఇప్పటికే మంత్రుల పేర్లు ఖరారయ్యాయని, వారి శాఖలు కూడా కేటాయించారని ప్రచారం జరిగింది. ప్రకటనే తరువాయి అంటూ అంతటా ఉత్కంఠ నెలకొన్నది. అందరూ హ్యాపీగా ఉండగా, గత ఆరు నెలలుగా మంత్రిమండలి విస్తరణ వాయిదా పడుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పర్వదినాన మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అందరూ భావించారు. కాంగ్రెస్ వర్గాల్లోనూ అదే అంశం చర్చనీయాంశమైంది.
Cabinet Expansion: రాష్ట్ర క్యాబినెట్‌లో మరో ఆరుగురికి మాత్రమే అవకాశం ఉన్నది. దీనిలో భాగంగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చెన్నూరి ఎమ్మెల్యే వివేక్, సుదర్శన్‌రెడ్డికి బెర్తులు ఖాయమైనట్టేనని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూ వస్తున్నది. అది ఇప్పటికీ ఊరిస్తూ వస్తున్నది.
Cabinet Expansion: ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విదేశీ పర్యటనలో ఉండటం, ఈ నెల మూడోవారంలో సీఎం రేవంత్‌రెడ్డి సైతం విదేశీ పర్యటనకు వెళ్తుండటంతో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్టేనని తేలింది. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉండటంతో జనవరిలో ఉండే అవకాశం లేనట్టేనని స్పష్టమవుతుంది. ఇప్పటికీ విస్తరణపై ఆశావహులు ఎదురు చూస్తూనే ఉన్నారు.