Bunny Vasu: ఒక పక్క సినిమా ఎగ్జిబిటర్ల అసోసియేషన్ థియేటర్లకి రెంట్ లాగా కాకుండా పర్సంటేజ్ విధానంలో సినిమాలను ఇవ్వాలని కోరుతుంటే.. బన్నీ వాసు మాత్రం వచ్చే పావులాలో ఎవరు ఎంత లాభం తీసుకోవాలని కొట్టుకోవడం కంటే, ఆడియన్స్‌ని థియేటర్ కి ఎలా రావించాలో ఆలోచించడం ముఖ్యం అని ఆయన ట్వీట్ చేశారు.
కొంతకాలంగా తెలుగు ఇండస్ట్రీలో 500 కోట్లు, 100 కోట్లు అంటూ పోస్టర్లు వేస్తూ భారీ కలెక్షన్స్ వస్తున్నట్టు చెప్పుకుంటున్నాము. కానీ ఇంతకుముందు రూపాయి లాభం వస్తే, ఇప్పుడు పెద్ద సినిమాలకి అర్ధ రూపాయి, చిన్న సినిమాలకి పావులా లాభం వస్తుందంటూ ఇండస్ట్రీలోని సంక్షోభాన్ని ఎత్తి చూపారు.
సినిమాలు చూడడానికి జనాలు థియేటర్ కి రావడం లేదని, వచ్చే కొంతమంది పైనే అధిక భారం అంటే.. టికెట్ రేటు, మల్టీప్లెక్స్‌లో క్యాంటీన్ ఖర్చు ఇలా అధిక భారం వేస్తున్నామని ఆయన అభిప్రాయపడ్డారు. జనాలు థియేటర్ కి రాకపోవడానికి మొత్తం 4 కారణాలు ఉన్నాయంటూ తన వెర్షన్ చెప్పుకొచ్చారు:
-
పెద్ద హీరోల సినిమాలు ఆలస్యం: పెద్ద హీరోల సినిమాలు సమయానికి రావడం లేదు. హీరోలు ఒక్కో సినిమా చేయడానికి ఒకటి లేదా రెండు సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు. దీనివల్ల ప్రేక్షకులకి థియేటర్ కి వచ్చి సినిమా చూడాలనే ఆసక్తి పోతోంది. మధ్యలో వచ్చే చిన్న సినిమాలను చూడడానికి జనాలు మొగ్గు చూపడం లేదు. పెద్ద హీరోలందరూ ప్రతి సంవత్సరం ఒక సినిమాతో వస్తే, నెలకు ఒక పెద్ద సినిమా వస్తుంది. అప్పుడు ఆడియన్స్ మళ్ళీ థియేటర్ కి రావడం మొదలుపెడతారు.
-
OTT ఒప్పందాలు: OTTతో సినిమా ప్రొడ్యూసర్స్ పెట్టుకుంటున్న ఒప్పందాల వల్ల, థియేటర్ కి వచ్చిన 26 రోజులకే సినిమా OTTలోకి వచ్చేస్తోంది. ఇది కూడా ప్రేక్షకులు థియేటర్ కి రాకపోవడానికి ఒక కారణమే అన్నారు.
-
క్యాంటీన్ ధరలు: సింగిల్ స్క్రీన్లలో కంటే మల్టీప్లెక్సుల్లో క్యాంటీన్ ధరలు అత్యధికంగా ఉండటం కూడా ఒక కారణం అన్నారు.
-
కంటెంట్ లోపం: ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయి కంటెంట్ లేకపోవడం వల్ల.. “ఇంత ఖర్చు పెట్టి థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరముందా?” అనే భావన ప్రేక్షకుల్లో కలుగుతోందని ఆయన తెలిపారు.
సినిమాకి జనాలు ఎందుకు రావడం లేదో వివరిస్తూ ఆయన ఈ కీలక అంశాలను ప్రస్తావించారు.
