Bumrah as Captain: రోహిత్ ఆబ్సెన్సీలో టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టేది స్పీడ్ స్టర్ బుమ్రానే. కొన్ని రోజులుగా దీనిపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ స్పష్టంగా ప్రకటించాడు కోచ్ గౌతమ్ గంభీర్. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకుంటే జస్‌ప్రీత్ బుమ్రా నాయకత్వ బాధ్యతలు చేపడతాడని, రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశాలున్నట్లు గంభీర్ చెప్పాడు.
Bumrah as Captain: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 22న తొలి టెస్టు ఆరంభం కానుంది. అదే సమయంలో తన భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చే అవకాశాలుండడంతో రోహిత్ ఈ మ్యాచ్‌లో ఆడడం సందేహంగా మారింది. అయితే రోహిత్ కు లీవ్ విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో గంభీర్ మాట్లాడుతూ.. ‘‘రోహిత్ ఆడతాడనే ఆశతోనే ఉన్నాం. బుమ్రా వైస్‌కెప్టెన్ కాబట్టి రోహిత్ అందుబాటులో లేకుంటే అతనే పెర్త్ లో జట్టును నడిపిస్తాడు. ఓపెనింగ్ కోసం ఈశ్వరన్, కేఎల్ రాహుల్‌ల రూపంలో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మ్యాచ్ సమయానికి తుది నిర్ణయం తీసుకుంటాం. అనుభవం, నాణ్యతను బట్టి ఆటగాడిని ఎంచుకుంటాం. రాహుల్ టాప్ ఆర్డర్లోనే కాక మిడిల్‌లోనూ ఆడగలడు. ఓపెనింగ్ చేయడంతో పాటు ఆరో స్థానంలోనూ ఆడగల రాహుల్ లాంటి ఆటగాళ్లు ఎన్ని జట్లలో ఏంటారు? రోహిత్ అందుబాటులో లేని పక్షంలో రాహుల్ ఓపెనింగ్ చేయడానికి అవకాశముంది’’ అని గంభీర్ అన్నాడు.
Bumrah as Captain: విరాట్ కోహ్లి ఫామ్ గురించి ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలపై గంభీర్ ప్రతిస్పందించాడు. ఆస్ట్రేలియా క్రికెట్‌కు పరిమితమైతే మంచిదంటూ రికీకి చురుకలు వేశాడు. కోహ్లి గత అయిదేళ్లలో రెండు సెంచరీలే చేసిన విషయం తెలిసిందని, అది ఆందోళన కలిగించే విషయమేనంటూ మరే టాప్ ఆర్డర్ బ్యాటర్ ఇలాంటి గణాంకాలతో ఉండడని పాంటింగ్ వ్యాఖ్యానించాడు. దీనిపై గంభీర్ తీవ్రంగానే స్పందించాడు. ‘‘పాంటింగ్ ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచించాలి. కోహ్లి, రోహిత్‌ల విషయంలో నాకు ఆందోళనే లేదు. వాళ్లిద్దరూ దృఢమైన వ్యక్తులు. భారత క్రికెట్ కోసం వాళ్లు ఎంతో చేశారు. మరెంతో సాధించాలని కోరుకుంటున్నారు. డ్రెస్సింగ్‌లో రూంలో ఉన్న వాళ్లందరూ తపనతో ఉన్నారా అన్నదే ముఖ్యం. అందులోనూ గత సిరీస్‌లో ఫలితం తర్వాత ఇది మరింత ప్రధానం’’ అని చెప్పాడు.
కోహ్లి, రోహిత్, అశ్విన్, జడేజా తమ కెరీర్లో చరమాంకానికి చేరుకున్నట్లేనని చర్చలు నడుస్తున్న నేపథ్యంలో భారత క్రికెట్లో సంధి దశ గురంచి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై గంభీర్ వ్యాఖ్యానిస్తూ ఇలాంటి విషయాలపై తనకెలాంటి ఆలోచనా లేదని, ప్రస్తుతం తన దృష్టంతా ఆస్ట్రేలియా పర్యటనలో అయిదు టెస్టులు ఎలా ఆడబోతున్నామన్న దాని మీదే ఉందన్నాడు. జట్టులోని మేటి ఆటగాళ్లు భవిష్యత్తులో మరింతగా సాధిస్తారని ధీమా వ్యక్తం చేశాడు. కాగా కేఎల్ రాహుల్ సైతం…ఆసీస్ సిరీస్కు సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపేలా జిమ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే రోహిత్ గైర్హాజరీలో ఓపెనర్గా అభిమన్యు ఈశ్వరన్ ను ఆడించాలన్న డిమాండ్లూ వినిపిస్తున్నది తెలిసిందే.