Tandur: గత ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ఓటర్లు కారు పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు. గిరిజన తండాల్లో కూడా కారు దిగేసి.. హస్తానికి జై కొట్టాయి. దీంతో బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకున్న బీఆర్ఎస్‌కు గిరిజనులు దూరమయ్యారనే క్లారిటీకి వచ్చారట.. ఏ ఏ వర్గాలు తమకు దూరం అయ్యాయోనని లెక్కలు చూసుకుంటూ… వాటిని సరి చేసుకునే పని బీఆర్‌ఎస్ మొదలుపెట్టింది. గిరిజనుల ఓట్లు తమకు పడలేదని గ్రహించిన బీఆర్ఎస్ వారిని దగ్గరకు తీసుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో గిరిజన సామాజికవర్గాల కోసం కొన్ని కార్యక్రమాలు చేసింది. తాండాలకు పంచాయితీలుగా గుర్తింపు. వేరే గ్రామ పంచాయతీల్లో భాగంగా ఉన్న తాండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ప్రత్యేక గిరిజన బోర్డు ఏర్పాటు, వాటికి ఛైర్మన్స్ నియామకం లాంటి కారణాలతో లంబాడా, ఆదివాసీలు కారు గుర్తు మీద నొక్కేస్తారని అనుకున్నారట… కానీ వారు అనుకున్నది గత ఎన్నికల్లో జరగలేదు.
ఇది కూడా చదవండి: Suryapet: రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం
Tandur: తెలంగాణలో మొత్తం 12 ఎస్టీ రిజర్వ్ సెగ్మెంట్స్ ఉంటే… వాటిలో కేవలం మూడు చోట్ల మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. దీంతో ఆ వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు ఎదురుచూస్తున్న పార్టీకి లగచర్ల ఘటన అస్త్రంగా మారింది. లగచర్ల ఎపిసోడ్‌లో గిరిజనులు మీదనే కేసులు పెట్టారని, వాటిని వెంటనే ఎత్తి వేయాలంటూ బీఆర్ఎస్ ఆందోళన మొదలుపెట్టింది. నమ్మకం కలిగించేందుకే గిరిజనుల్ని, వారి నాయకుల్ని ఢిల్లీ దాకా తీసుకెళ్లింది. గిరిజనులకు అండగా ఉంటామని బీఆర్‌ఎస్ భరోసా కల్గిస్తోంది. ఇదే క్రమంలో ఎస్టీ నియోజకవర్గాల్లో ఆందోళనలు చేపట్టేలా బీఆర్‌ఎస్ ప్లాన్ చేసింది. దీనిలో భాగంగా మహబూబాబాద్‌లో కేటీఆర్ గిరిజన దీక్ష చేపట్టారు. ఆ పార్టీ వేసిన స్కెచ్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి..