Nagpur: బాంబ్ బెదిరింపులతో ఎయిర్ పోర్ట్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు అనే తేడా లేకుండా ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారానికోసారి ఫోన్ చేస్తూ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు.
తాజాగా నాగ్‌పూర్ నుంచి కోల్‌కతా వెళ్తున్న విమానానికి గురువారం ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది. విమానంలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాలని భావించారు. అధికారుల అనుమతితో విమానాన్ని రాయ్‌పూర్ కు దారి మళ్లించి అక్కడ సేఫ్‌గా ల్యాండ్ చేశారు అనంతరం ప్రయాణికులనంతా దింపేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. డాగ్ స్వ్కాడ్, బాంబ్ స్వ్కాడ్‌తో అక్కడికి చేరుకొని విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలూ లభించలేదని తెలిసింది. ఘటనపై అక్కడ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు.