Madras Regiment

Madras Regiment: బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్

Madras Regiment: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 10 రోజుల పాటు ఉత్కంఠ రేపిన ఈ కేసును భద్రతా బలగాలు, పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. చోరీకి గురైన ఆయుధాలు, మ్యాగజైన్లు, బుల్లెట్లు, నైట్ విజన్ బైనాక్యులర్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఒక విశ్రాంత ఆర్మీ అధికారితో పాటు మరో ఇద్దరు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మహబూబ్‌నగర్‌లో ఆయుధాల స్వాధీనం..

ఆయుధాల చోరీపై బొల్లారం పోలీసులు, మల్కాజిగిరి స్పెషల్ టీమ్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), ఆర్మీ ఇంటెలిజెన్స్ విభాగాలు సంయుక్తంగా చేపట్టిన దర్యాప్తులో కీలక సమాచారం లభించింది.
మహబూబ్‌నగర్‌లో నివాసముంటున్న ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించి, చోరీకి గురైన ఆయుధ సామగ్రిని నిన్న రాత్రి స్వాధీనం చేసుకున్నారు.
లోపలి వ్యక్తుల సహకారంతోనే చోరీ – ఎలా జరిగిందంటే?..
మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాలు భద్రపరిచే ‘కోటె’ విభాగంలోని బెల్ ఆఫ్ ఆర్మ్స్ ఇన్‌ఛార్జ్, మందుగుండు-బుల్లెట్లు పంపిణీ చేసే అమ్యునిషన్ సెక్షన్ ఇన్‌ఛార్జ్‌ల సహకారంతోనే ఈ తతంగం నడిచినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి.వీరిద్దరి అండదండలతోనే రిటైర్డ్ ఆర్మీ అధికారి క్యాంపస్‌లోకి వచ్చి, అదును చూసి ఆయుధాలను బయటకు తరలించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
అసలు ఏం జరిగింది? – కలకలం రేపిన లిస్ట్:
ఆగస్టు 30 సాయంత్రం 6 గంటల నుంచి ఆగస్టు 31 ఉదయం 7 గంటల మధ్య బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో భారీ ఆయుధ చోరీ జరిగింది.రెజిమెంట్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ మయాంక్ గోవిటీర్కార్ ఫిర్యాదుతో బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు.మొత్తం 12 అత్యాధునిక తుపాకులు, 21 మ్యాగజైన్లు, 1,912 రౌండ్ల బుల్లెట్లు, అత్యాధునిక నైట్ విజన్ బైనాక్యులర్ మాయమవ్వడం జాతీయ స్థాయిలో రక్షణ శాఖను ఉలిక్కిపడేలా చేసింది.
మీడియా ముందుకు వివరాలు..
అదుపులో ఉన్న నిందితుల నుంచి ఈ ఆయుధాలను ఎవరికైనా విక్రయించేందుకు తీసుకెళ్లారా? లేక ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే కోణంలో తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తున్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్, ఉన్నత ఆర్మీ అధికారులతో కలిసి త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారిక వివరాలను వెల్లడించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *