Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: చరణ్, చైత్ర రాయ్‌లకు బంపర్ ఛాన్స్.. రీ-ఎంట్రీ కోసం ఓటింగ్ షురూ..!

Bigg Boss 10 Telugu: బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్ సీజన్ 10’ ప్రారంభం నుంచే ప్రేక్షకులకు అదిరిపోయే ట్విస్టులు ఇస్తోంది. తొలి వారంలోనే ఎవరూ ఊహించని విధంగా ఆర్జే చరణ్, నటి చైత్ర రాయ్ ఎలిమినేట్ కావడం తీవ్ర చర్చకు దారితీసింది. వారిని సీక్రెట్ రూమ్‌లో ఉంచారని అంతా భావించినప్పటికీ.. “వారు సీక్రెట్ రూమ్‌లో లేరు, నేరుగా ఇంటికే పంపించేశాం” అని నాగార్జున లైవ్‌లో చెప్పడంతో వారి ప్రయాణం ముగిసిపోయిందనే అంతా అనుకున్నారు. అయితే, బిగ్‌బాస్ మేకర్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంటూ వీరిద్దరి రీ-ఎంట్రీకి తెరలేపారు. హౌస్‌లోకి తిరిగి అడుగుపెట్టే అవకాశం రావడంతో చరణ్, చైత్ర సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులను ఓట్లు కోరుతూ విడుదల చేసిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

నాకు మీ సపోర్ట్ కావాలి – ఆర్జే చరణ్ విజ్ఞప్తి..

హౌస్‌లోకి తిరిగి వెళ్లేందుకు బిగ్‌బాస్ అవకాశం కల్పించారని ఆర్జే చరణ్ ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఓటింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, సెప్టెంబర్ 16 మధ్యాహ్నం వరకు మాత్రమే సమయం ఉందని తెలిపారు. తన నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి ఓటు వేయాలని, ప్రేక్షకుల మద్దతుతోనే తాను తిరిగి హౌస్‌లోకి అడుగుపెట్టగలనని కోరారు.

ఇకపై నటన లేదు.. కేవలం చైత్ర మాత్రమే”: చైత్ర రాయ్ ఎమోషనల్ పోస్ట్..

మరోవైపు నటి చైత్ర రాయ్ సైతం తన పునరాగమనంపై భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు. “ఒకే ఒక్క అవకాశం నా రీ-ఎంట్రీ తలుపు తెరిచింది. మీరు వేసే ఓటే నా ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. మరింత ధైర్యం, ఆత్మవిశ్వాసంతో హౌస్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాను” అని పేర్కొన్నారు.

“ఇకపై ఎలాంటి నటన ఉండదు, కేవలం చైత్ర చైత్రలాగే కనిపిస్తుంది. నన్ను తిరిగి పంపిస్తే ప్రతి టాస్క్‌లో నా వంద శాతం శ్రమిస్తాను. ఆట ఎంత కఠినంగా మారినా దృఢంగా నిలబడతాను” అని అభిమానులకు హామీ ఇస్తూ ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు. వీరిద్దరిలో ఎవరు ప్రేక్షకుల మద్దతు పొంది హౌస్‌లోకి తిరిగి ఎంట్రీ ఇస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *