Telangana: తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు రాష్ట్ర ప్రభుత్వం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ ఈ నెల 16 నుంచి బహిరంగ విచారణ జరుపనున్నది. వరుసగా మూడు రోజుల పాటు వివిధ జిల్లాల్లో ఈ కమిషన్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగనున్నది. ఈ సందర్భంగా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, కులసంఘాల ప్రతినిధులు సహా ప్రజలు కూడా పాల్గొని తమ అభ్యంతరాలను, విజ్ఞాపనలను అందించవచ్చని కమిషన్ పేర్కొన్నది.
Telangana: ప్రతిరోజూ ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ విచారణ ఉంటుందని అధికారులు తెలిపారు. తొలిరోజైన ఈ నెల 16న నల్లగొండలోని జిల్లా కలెక్టరేట్‌లో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల ప్రజలకు, ఈ నెల 17న ఖమ్మం కలెక్టరేట్‌లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజలు విచారణలో పాల్గొనాల్సిందిగా కోరారు. అదే విధంగా ఈ నెల 18న మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లో జరిగే విచారణలో మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూలు, నారాయణపేట జిల్లాల ప్రజలు పాల్గొనాల్సిందిగా కోరారు.