AP News

AP News: ఒంగోలు వైసీపీలో తీవ్ర కలకలం.. సొంత పార్టీ నేతల దాడితో మహిళా లీడర్ ఆత్మహత్యాయత్నం!..

AP News: వైసీపీ (YCP) పార్టీకి చెందిన నాయకులే తనపై దాడి చేశారనే తీవ్ర బాధతో.. అదే పార్టీకి చెందిన ఒక మహిళా నాయకురాలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించడం ప్రకాశం జిల్లాలో పెద్ద సంచలనంగా మారింది. ఒంగోలు నగరంలోని వైసీపీ ఆఫీస్‌లో ఈనెల 8వ తేదీన వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఆ కార్యక్రమంలో జనాల రద్దీలో తనను తోసివేశారని, కాళ్లు తొక్కారని ఒంగోలు వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న ప్రశ్నించారు. దీనిపై అక్కడే ఉన్న మేరీ కుమారి అనే మహిళా నేత భర్త శివకుమార్.. పార్టీ నాయకుల ముందే ప్రసన్నపై దారుణంగా దాడికి పాల్పడ్డాడు.

తన తల్లిపై దాడి జరిగిందనే కోపంతో ప్రసన్న కొడుకు మదన్ కుమార్ కూడా సదరు వైసీపీ నేత శివకుమార్‌పై తిరుగు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ గొడవ అనంతరం బాధితురాలు ప్రసన్న ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేయడంతో శివకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, పోలీసులకు ఫిర్యాదు చేసిందనే నెపంతో ఒంగోలు వైసీపీ ఇన్‌ఛార్జి చుండూరి రవిబాబు.. పార్టీకి సంబంధించిన అన్ని అధికారిక వాట్సప్ గ్రూపుల నుండి ప్రసన్నను అర్ధాంతరంగా తొలగించారు.

పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న తనను ఇలా గ్రూపుల నుండి తీసేయడం, అవమానించడంతో ప్రసన్న తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ అన్యాయానికి ఒంగోలు వైసీపీ ఇన్‌ఛార్జి చుండూరి రవిబాబే కారణమని ఆరోపిస్తూ ఆమె ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆ తర్వాత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీనిని గమనించిన ఆమె ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి (రిమ్స్) తరలించారు. ప్రస్తుతం ఆమెకు డాక్టర్లు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వైసీపీ సొంత పార్టీ వర్గాల్లోనే జరిగిన ఈ అంతర్గత గొడవ, మహిళా నేత ఆత్మహత్యాయత్నం ఉదంతం జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *