Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ముంబైలో భుజానికి శస్త్రచికిత్స (ఆపరేషన్) విజయవంతంగా ముగిసింది. ముంబైలోని ప్రముఖ ‘కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్’కు చెందిన నిపుణులైన డాక్టర్ల బృందం ఈ సర్జరీని నిర్వహించింది. ఆయన కుడి భుజానికి ఉన్న ‘రొటేటర్ కఫ్’ గాయానికి దాదాపు మూడున్నర గంటల పాటు ఆపరేషన్ చేసి విజయవంతంగా పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో కోలుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పవన్ కళ్యాణ్‌కు ఫోన్ చేసి, ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని పీఎం మోదీ ఆకాంక్షించారు.
నిజానికి పవన్ కళ్యాణ్‌కు రెండు భుజాలకూ తీవ్రమైన గాయాలు (రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్) ఉన్నాయి. రొటేటర్ కఫ్ అంటే మన భుజం సజావుగా కదలడానికి ఉపయోగపడే కండరాలు, నరాల సముదాయం. ఈ భాగంలో గాయం కావడం వల్ల చేతిని పైకెత్తాలన్నా, సాధారణ కదలికలు చేయాలన్నా తీవ్రమైన నొప్పి వస్తుంది. పవన్ కళ్యాణ్‌కు రెండు భుజాల కండరాలు కూడా చిట్లిపోయినట్లు ఇటీవల వైద్య పరీక్షల్లో తేలింది. అయితే రెండు భుజాలకూ ఒకేసారి ఆపరేషన్ చేస్తే నొప్పి ఎక్కువగా ఉంటుందని, చేతులను అసలు కదిలించలేరని డాక్టర్లు భావించారు. అందుకే ముందుగా కుడి భుజానికి మాత్రమే సర్జరీ చేశారు. ఎడమ భుజానికి మరో రెండు నెలల తర్వాత రెండో విడత శస్త్రచికిత్స చేయనున్నట్లు డాక్టర్లు తెలిపారు.
పవన్ కళ్యాణ్‌కు భుజాల నొప్పి సమస్య ఈనాటిది కాదు, దాదాపు పదేళ్లుగా ఆయన ఈ నొప్పితో బాధపడుతున్నారు. 2016లోనే ఆయనకు మొదటిసారి భుజానికి గాయమైంది. అప్పట్లో డాక్టర్లు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పినా.. ఆయన ప్రజా సమస్యలపై పోరాడేందుకు రాజకీయాల్లో బిజీగా ఉండిపోయారు. ఆ తర్వాత 2018లో చేసిన పోరాట యాత్ర, రైతుల పర్యటనలు, వారాహి యాత్ర ఇంకా ఇటీవలి ముగిసిన సార్వత్రిక ఎన్నికల ప్రచారాల్లో ఈ గాయాలు మరింత ఎక్కువయ్యాయి. పవన్ కళ్యాణ్‌ను చూడటానికి ఎక్కడికి వెళ్లినా వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు పోటీపడేవారు. ఆ సమయంలో ఆయనతో కరచాలనం (హ్యాండ్‌షేక్) చేయడం, సెల్ఫీల కోసం చేతులు పట్టుకుని గట్టిగా లాగడం వల్ల భుజాలపై ఒత్తిడి పడి కండరాలు బాగా దెబ్బతిన్నాయి. ఇంత తీవ్రమైన నొప్పితోనూ ఆయన పదేళ్లుగా ప్రజా జీవితాన్ని కొనసాగించడం చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లోనే భుజాల పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని, వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్లు పవన్ కళ్యాణ్‌కు సూచించారు. కానీ, ప్రజలు నమ్మి అప్పగించిన ప్రభుత్వ బాధ్యతలు, ముందే ఖరారైన అధికారిక కార్యక్రమాలు ఉన్నందున.. విధులను మధ్యలో వదిలేయడం ఇష్టం లేక పవన్ కళ్యాణ్ సర్జరీని వాయిదా వేసుకున్నారు. డ్యూటీలన్నీ పూర్తయ్యాకే ఇప్పుడు హాస్పిటల్లో చేరారు. రొటేటర్ కఫ్ ఆపరేషన్ తర్వాత పూర్తిగా కోలుకోవడానికి కొన్ని వారాల టైమ్ పడుతుంది. భుజానికి ప్రత్యేక సపోర్ట్ బెల్ట్ ధరించి, ఆ తర్వాత ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ గ్యాప్‌లో పవన్ కళ్యాణ్ పాలనా వ్యవహారాలకు ఇబ్బంది లేకుండా అవసరమైన చోట ఆన్లైన్ (వర్చువల్) మీటింగ్స్ ద్వారా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో అభిమానులు, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.
