Mahanadu Evariki Mudindi

Mahanadu Evariki Mudindi: మహానాడు తర్వాత ‘ముహూర్తం’ ఎవరికి?

Mahanadu Evariki Mudindi: మహానాడు వరకు ఒక లెక్క, మహానాడు తర్వాత మరో లెక్క. ఇదీ టీడీపీ అంటోన్న మాట. ఇప్పటికే కేసులున్నా కూడా కొడాలి నానికి ఉన్న అనారోగ్య సమస్యల కారణంగా కొంచం గ్యాప్ ఇచ్చారు ఏపీ పోలీసులు. తాజాగా కొడాలికి లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. దేశం విడిచి వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. అంటే మహానాడు ముగిసిన ఏ క్షణమైనా కొడాలి నాని అరెస్ట్ ఉండొచ్చన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఇక అరెస్ట్‌ లిస్ట్‌లో… వైసీపీ పెద్ద తలలైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలతో పాటూ మరి కొందరు ఉన్నారంటున్నారు. ఖైదీ నెంబర్ – ఎక్స్‌.. గెట్ రెడీ ఫర్ అరెస్ట్.. అన్న సంకేతాలు చేరాల్సిన వారికి చేరిపోయాయంటున్నారు. దీంతో ప్యాలస్‌ వర్గాల్లో వొణుకు మొదలైంది అంటున్నారు.

మహానాడు తర్వాత వైసీపీ నాయకులకు అరెస్ట్‌ గండం పొంచి ఉంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్‌తో పాటూ మైనింగ్ మాఫియా, అటవీ భూముల కబ్జా కేసుల్లో దర్యాప్తు ఊపందుకుంటోంది. రాజకీయ ఒత్తిళ్లు, దర్యాప్తుల తీవ్రత పెరుగుతున్న వేళ, తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం తర్వాత.. కొందరు వైసీపీ కీలక నాయకులకు అరెస్ట్‌ గండం ముంచుకొస్తోందని ప్రచారం జోరందుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో సహా.. పెద్దిరెడ్డి, సజ్జల, కొడాలి వంటి వైసీపీ ప్రముఖ నేతలు అరెస్ట్‌కు గురయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మహానాడు తర్వాత ఈ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటూ, అరెస్ట్‌లకు రంగం సిద్ధమవుతోందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో, వైసీపీ నాయకులు జైలుకు క్యూ కట్టే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై లిక్కర్ స్కామ్ సహా విచారణ జరుగుతోన్న అనేక స్కాముల్లో అంతిమ లబ్ధిదారుడు అన్న ఆరోపణలున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అక్రమ మైనింగ్‌కు సంబంధించిన ఆరోపణలు, అటవీ భూములను కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి. మైనింగ్ మాఫియాకు సంబంధించిన కేసుల్లో పెద్దిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా, అటవీ భూముల కబ్జా ఆరోపణల్లో సజ్జల పేరు కూడా చేరింది. ఈ ఇద్దరి నాయకులపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దీంతో వారు కూడా అరెస్ట్‌కు గురయ్యే అవకాశం ఉందని అంచనా. ఇక కొడాలి నానిపై గుడివాడ నియోజకవర్గంలో గతంలో చేసిన అనేక అక్రమాలు, అవినీతికి సంబంధించిన ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. కొడాలి నాని అరెస్ట్‌ అయితే మాత్రం.. వంశీ కన్నా పరిస్థితి దారుణంగా ఉంటుందని పొలిటికల్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే వంశీ జైలులో 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఒక కేసులో బెయిల్‌ వస్తే.. మరో కేసులో పీటీ వారెంట్‌ జారీ అవుతోంది. దీంతో వంశీ ఎప్పుడు బయటకొస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్క కేసులో ఒక్కసారి అరెస్ట్‌ అయితే.. ఆ తర్వాత కొడాలి నాని పరిస్థితి కూడా ఇలాగే మారే అవకాశం ఉంది.

ALSO READ  Mega PTM 2.0 Lokesh: జగన్‌ బైజూస్‌ కాదు కావాల్సింది.. లోకేష్‌ మెగా పీటీఎం

Also Read: YS Jagan: స్థానిక సంస్థల ప్రతినిధులతో నేడు జగన్‌ భేటీ

Mahanadu Evariki Mudindi: జగన్, పెద్దిరెడ్డి, సజ్జల, కొడాలి నానితో పాటు మరికొందరు వైసీపీ నాయకులు కూడా అరెస్ట్‌ జాబితాలో ఉన్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన అరాచక దాడి కేసుకు సంబంధించి తాజాగా మంగళగిరి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డిని 127వ నిందితుడుగా చేర్చారు. ఈ మేరకు సిఐడి పోలీసులు కేసు నమోదు చేసినట్లు మీడియాకు సమాచారం కూడా ఇచ్చారు. ఇక ఇదే కేసులో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి దేవినేని అవినాష్‌పై కూడా దృష్టి పెట్టవచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇలా పలు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు పక్కా వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. లుక్‌ఔట్ నోటీసులు, ఆధారాల సేకరణ, విచారణలు వేగవంతం కావడంతో, మహానాడు తర్వాత రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. మొత్తానికి ఎవరెవరు ముందు అరెస్ట్‌ అవుతారు, ఎవరు క్యూలో ఉంటారన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *