Jupally Set Right ADB Dish: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో నిత్యం వర్గపోరుతో మూడు గ్రూపులు, ఆరుగురు నేతలు అనే విధంగా తయారయింది. తాజాగా ఈ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గ ఇంచార్జ్ రావి శ్రీనివాస్‌పై ఆరేళ్ల సస్పెన్షన్ వేటు పడటంతో పార్టీ పరిస్థితి పెనము పై నుండి పొయ్యిలో పడినట్టయింది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో కీలక నేతగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి రాంరాం చెప్పిన పరిస్థితి. దీంతో ఆయన క్యాడర్ అంతా పార్టీకి దూరం దూరంగానే ఉంటూ వస్తోంది. తాజాగా రావి శ్రీనివాస్‌పై హస్తం అధిష్ఠానం సస్పెన్షన్ వేటు వేయడంతో సిర్పూర్‌లో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని కార్యకర్తలు వాపోతున్నారు.
రావి శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్కపై గతంలో విమర్శలు చేశారని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారని ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఇటీవల టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయడం, దీనిపై స్పందించిన అధిష్ఠానం రావి శ్రీనివాస్‌ను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దండె విఠల్‌కు లైన్ క్లియర్ అయిపోయిందని చెప్పవచ్చు. ఇన్నాళ్లు కోనప్ప, రావి శ్రీనివాస్, దండె విఠల్‌ల మధ్య మూడు ముక్కలాటగా సాగిన కాంగ్రెస్ వర్గపోరుకు ఈ నిర్ణయం చెక్ పడినట్టయింది.
Also Read: Case on Pawan Kalyan: ఒక్క స్పీచ్‌తో నిద్రలేని రాత్రుల్ని మిగిల్చాడా?
కొత్త ఇంచార్జ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రం అందరినీ కలుపుకుని పోతామని, బహిష్కృత నేతలంటూ ఎవరూ ఉండరని, అంతా మావాళ్లే అని చెప్పుకుంటూ వస్తుంటే, ఆయన జిల్లా పర్యటన ముగిసిన వెంటనే రావి శ్రీనివాస్‌పై వేటు పడటంతో ఆయన ఒకటి తలిస్తే క్రమశిక్షణ కమిటీ మరొకలా గిఫ్ట్ ఇచ్చిందనే చర్చ మొదలైంది. అసలే ఉమ్మడి ఆదిలాబాద్‌లో వర్గపోరును బరించలేక ఈ జిల్లా ఇంచార్జ్ పదవి నాకొద్దంటూ మంత్రి సీతక్క ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ బాధ్యతల నుండి తప్పుకోగా, తాజాగా వచ్చిన ఇంచార్జ్ మంత్రి అందరినీ కలుపుకుని పోతానంటూ సంకేతాలు ఇచ్చిన సమయంలో, పార్టీ నుండి సీనియర్ నేత సస్పెన్షన్‌తో క్యాడర్‌ను డైలమాలో పడేసిందని చర్చ మొదలైంది. అయితే, సస్పెండ్ అయిన రావి శ్రీనివాస్, తనపై మంత్రి సీతక్క కుట్ర చేసి పీసీసీ అధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చి పార్టీ నుండి సస్పెండ్ చేయించారని, రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీకి మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతానంటున్నారు.
Also Read: Chandrababu: బనకచర్ల ప్రాజెక్టు ను కావాలనే రాజకీయం చేస్తున్నారు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Jupally Set Right ADB Dish: మరోవైపు ఆసిఫాబాద్‌లో కూడా వర్గపోరును సెట్ రైట్ చేసేందుకు సైతం సస్పెన్షన్ అస్త్రాన్ని వాడబోతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడ డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌కు, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్యామ్‌నాయక్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వైరం కొనసాగుతూ వస్తోంది. గతంలో ఈ ఇద్దరి మధ్య గొడవ పోలీస్ స్టేషను మెట్లు కూడా ఎక్కింది. కేసులు నమోదవడం సంచలనంగా మారడంతో, ఇక్కడ కూడా సస్పెన్షన్ అస్త్రమే సమాధానం అన్నట్టుగా క్రమశిక్షణ సంఘం భావిస్తున్నట్టుగా చర్చ జరుగుతోంది. ఇదే నిజమైతే, కొత్త ఇంచార్జ్‌కు ఈ సస్పెన్షన్ల వేటు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టడం ఖాయం. జిల్లా కొత్త ఇంచార్జ్ మంత్రి మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్‌లో బహిష్కృత నేతలను కలిసి, అందరినీ కలుపుకుపోతామని, పాత, కొత్త నేతల మధ్య గ్యాప్‌ను తొలగిస్తామని, పార్టీకి పునర్వైభవం తెస్తామని చెప్పుకుంటున్నారు. అయితే, అధిష్ఠానం మాత్రం సస్పెన్షన్ల బహుమానం ఇస్తుండటంతో, పార్టీ పరిస్థితి ఎలా మారుతుందో, స్థానిక ఎన్నికల్లో ఎన్ని అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న ఆందోళన మాత్రం కార్యకర్తల్లో కనిపిస్తుంది. చూడాలి మరి, హస్తం అధిష్ఠాన నిర్ణయం ఆసిఫాబాద్ కాంగ్రెస్‌ను ఏ తీరానికి చేరుస్తుందో.