Industry vs Pawan: “సినిమా వాళ్లమండీ మేము. కళాకారులం. మాకు రాజకీయాలు అంటగట్టకట్టండి.” సినీ ప్రముఖుల నుండి తరచూ వినిపించే మాటలివి. కానీ రాజకీయం, సినిమా రంగం.. పాలు, నీళ్లలా విడదీయలేని రోజులివి. తెలుగు సినీ రంగంలో మొదట్నుంచీ కొన్ని పెద్ద కుంటుంబాలు రాజకీయ ఆసక్తులు కలిగి ఉండటం మనం గమనించొచ్చు. తరం మారినా, వారి సినీ వారసులు కూడా ఏదో ఒక రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపిస్తుండటం నేటికీ గమనిస్తున్నాం. ఒక్కో ప్రభుత్వానిది ఒక్కో తీరులా ఉంటుంది. ఇక సినీరంగ సమస్యలపై ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వాలను అప్రోచ్ అయ్యే తీరు కూడా ప్రభుత్వాలతో పాటూ మారుతోంది. ఇక్కడే సమస్య అసలు తలెత్తుతోంది. ఉదాహరణకు తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ… బీఆర్‌ఎస్ నేతలతో సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు రాసుకుపూసుకు తిరిగేవారన్న విమర్శలున్నాయ్. ఇక సినీ ప్రముఖులతో మాజీ మంత్రి కేటీఆర్‌కి ఉన్న సంబంధాలు, మెయింటైన్ చేసిన వ్యవహారాలపై ఇప్పటికీ విమర్శలు వస్తుంటాయ్. ఇక ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండస్ట్రీ ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. సినిమా టికెట్ రేట్లు 5 రూపాయలకు, 10 రూపాయలకు తగ్గించడం, సినిమా హాళ్ల వద్ద తహసీల్దార్లను కాపలా పెట్టడం వంటి చర్యలతో బెంబేలెత్తిపోయింది సినీ ఇండస్ట్రీ. దాంతో సినీ ఇండస్ట్రీ మొత్తం జగన్ ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సి వచ్చింది.
ఇక ఏపీలో, తెలంగాణలో ప్రభుత్వాలు మారినా సినీ ఇండస్ట్రీ పరిస్థితిలో మార్పు మాత్రం కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయ్. ప్రభుత్వాలు మారడంతో ఇండస్ట్రీని శాసిస్తున్న పెద్దల్లో వారి వారి వ్యక్తిగత ఇంట్రస్టులు, ఈగోల కారణంగా విభేదాలొచ్చినట్లున్నాయి. దీంతో ఇండస్ట్రీగా కలిసి ఉడాల్సిన సినిమా రంగం.. ఎవరి స్వార్థం వారు చూసుకునేలా తయారైంది. మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీసు నుండి విడుదలైన లేఖలో.. ప్రధానంగా ప్రస్తావించిన అంశం కూడా ఇదే. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్న హరిహర వీరమళ్లు చిత్రానికే ఎసరు పెట్టారంటూ బయటకొచ్చిన ఆ నలుగురు ప్రొడ్యూసర్లలో ముగ్గురికి పవన్ కళ్యాణ్‌తో ఎలాంటి పొరపొచ్చాలు లేవు. దిల్ రాజు అయితే పవన్ కళ్యాణ్‌తో ఎంత సఖ్యతగా ఉంటారో అందరికీ తెలిసిందే. మరి పవన్ కళ్యాణ్ సినిమాకే నష్టం జరిగేలా థియేటర్ల బంద్ అంటూ కుట్రలెలా జరిగాయి? దీని వెనుక ఎవరి హస్తం ఉంది? అన్నది ఆ నలుగురే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అల్లు అర్వింద్, దిల్ రాజు మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. జరిగిన తప్పు పెద్దది కాకుండా సరిదిద్దుకునే పని మొదలుపెట్టారు.
Also Read: YCP Leaders Abscond: వైసీపీ నేతల అజ్ఞాతవాసానికి కారణాలేంటి?
Industry vs Pawan: తెలంగాణలో మొన్నటి దాకా రేవంత్‌రెడ్డి వర్సెస్ సినీ ఇండస్ట్రీ అన్నట్లుగా వార్ నడిచింది. సినీ ఇండస్ట్రీ మీద రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కక్ష ఏముంటుంది? కానీ కొందరు సినీ ప్రముఖల వ్యవహారం, వారు ప్రవర్తించిన తీరు రేవంత్‌రెడ్డిని బాధించింది. అసెంబ్లీ వేదికగానే ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఇకపై టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవనీ.. సినీ ప్రముఖుల బౌన్సర్ల విషయంలో కఠినంగా ఉంటామని అసెంబ్లీ వేదికగానే హెచ్చరించే పరిస్థితి వచ్చింది. అప్పటికి కానీ.. ప్రభుత్వంలో ఎవరున్నా సరే మర్యాద ఇవ్వాల్సిందే.. సీఎంను గౌరవించుకోవాల్సిందే అన్న అంశం జ్ఞప్తికి రాలేదు సినీ ఇండస్ట్రీకి. వెంటనే ఇండస్ట్రీ తరఫున పలువురు పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి శాలువాలతో సత్కరించి, శాంతిపజేయాల్సి వచ్చింది. ఇప్పుడీ పరిస్థితి ఏపీలోనూ కొని తెచ్చుకుంది సినిమా రంగం. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా.. సినీ ఇండస్ట్రీ నుండి సీఎం చంద్రబాబును ఎందుకు కలవలేదంటూ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ లేవదీసిన ప్రశ్న అత్యంత సమంజసం అనిపిస్తోంది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ట్రీట్ చేసిన విధానాన్ని అప్పుడే మర్చిపోతే ఎలా అన్నది ఇండస్ట్రీనే ఆలోచించుకోవాలి. లేదంటే పవన్ ధర్మాగ్రహం ఎలా ఉంటుందో సినీ పెద్దలకే బాగా తెలుసంటున్నారు సినీ, పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్.