YCP Leaders Abscond

YCP Leaders Abscond: వైసీపీ నేతల అజ్ఞాతవాసానికి కారణాలేంటి?

YCP Leaders Abscond: గత వైసీపీ హయాంలోనూ రాజకీయ కేసులకు కొదవేమీ లేదు. ఏకంగా చంద్రబాబునే టార్గెట్‌ చేశారు అప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డి. స్కిల్‌ కేసుతో మొదలు పెట్టి.. చంద్రబాబుపై 7 వరుస కేసులు నమోదయ్యాయి. స్కిల్‌ కేసులో అరెస్ట్‌ అయ్యి 53 రోజులు రాజమండ్రిలో జైలు జీవితం కూడా గడిపారాయన. తమ సొంత పార్టీలో ఎంపీగా ఉన్న రఘురామను అరెస్ట్‌ చేసి, పోలీసు కస్టడీలో టార్చర్‌ చేయించారన్న ఆరోపణలపై ఇప్పుడు కేసు నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రుల్నీ వదల్లేదు వైసీపీ. కొల్లు రవీంద్రపై ఏకంగా మర్డర్‌ కేసు పెట్టి అరెస్ట్‌ చేశారు. వైసీపీ హయాంలో తనపై 5 తప్పుడు కేసులు నమోదు చేసినట్లు కొల్లు రవీంద్ర ఓ సందర్భంలో ఆరోపించారు.

వైసీపీ హయాంలో మరో టీడీపీ సీనియర్‌ నేత అచ్చెన్నాయుడును అరెస్ట్‌ చేసి, తరలించిన వైనం వివాదాస్పదం అయ్యింది. ఆపరేషన్‌ చేయించుకున్న అచ్చెన్నాయుడును, శ్రీకాకుళంలో అరెస్ట్‌ చేసి కావాలనే రోడ్డు మార్గంలో తీసుకొచ్చారని అప్పట్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది వైసీపీ ప్రభుత్వం. ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న అయ్యన్న పాత్రుడుని అప్పట్లో ఓ సిల్లీ కేసులో వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ఇక తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ దివాకర్‌పై వైసీపీ హయాంలో ఎన్ని కేసులు బుక్కయ్యాయో లెక్కేలేదు. సుమారు రెండు నెలల పాటు ఆయన్ను జైల్లో ఉంచినట్లున్నారు. మచ్చుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నారా లోకేష్‌ రెడ్‌ బుక్‌ కాన్సెప్ట్‌ తెరపైకి తీసుకురావడానికి మెయిన్‌ రీజన్‌.. టీడీపీ కార్యకర్తలు, నేతలపై నమోదవుతున్న అక్రమ కేసులే అని చెబుతారు. అయితే.. చంద్రబాబుతో మొదలు పెడితే.. ఆ నాడు టీడీపీ నేతలు ఎవరూ పోలీసుల నుండి తప్పించుకుని పరారైన సందర్భాలు లేవు. కేసులు ఎదుర్కొన్నారు, అరెస్ట్‌లు అయ్యారు.

ఇక కూటమి అధికారంలోకి వచ్చాక.. రివర్స్‌లో వైసీపీ నేతలపై కేసులు మొదలయ్యాయి. ఇవన్నీ కక్షపూరితంగా పెడుతున్న కేసులని వైసీపీ అంటున్నా… వైసీపీ నేతల స్వయంకృతాపరాధాలే అని చాలామంది భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి భిన్నంగా.. వైసీపీ నేతలపై కక్ష సాధింపుకన్నా పాలనపై దృష్టి పెట్టాలని భావించినా.. వైసీపీ నేతలు బరితెగించి చేసిన తప్పులకు ఆధారాలు పెద్దగా కష్టపడకుండానే లభిస్తుండటంతో.. వీళ్ల అరెస్టులు తప్పట్లేదు. ఇక స్కామ్‌ తెరపైకి రాగానే.. దమ్ముంటే అరెస్ట్‌ చేసుకోమంటూ ప్రగల్భాలు పలకడం, అరెస్టుకు కావాల్సిన ప్రాధమిక ఆధారాలు దొరికాయనగానే పత్తా లేకుండా పారిపోవడం, అజ్ఞాతం నుండే ముందుస్తు బెయిల్‌ పిటిషన్ల వేసుకోవడం, కోర్టులు వాటిని తిరస్కరించడం, చివరికి అరెస్ట్‌ అవ్వడం వైసీపీలో షరా మామూలుగా మారింది. వల్లభనేని వంశీ హైదరాబాద్‌లో అజ్ఞాత వాసంలో ఉండగానే అరెస్ట్‌ అయ్యారు.

ALSO READ  VISA – Vintara Saradaga: VISA ~ వింటారా సరదాగా టీజర్ విడుదల.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా అశోక్ గల్లా కొత్త రూపం!

Also Read: Mahanadu 2025: మహానాడులో పార్టీ వార్షిక నివేదిక…

YCP Leaders Abscond: కొడాలి నాని గుండె ఆపరేషన్‌ పేరిట ముంబై వెళ్లి.. అట్నుంచి అటే విదేశాలకు పరారయ్యే ప్లాన్‌ వేయడంతో లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ అయ్యాయి. గోదాములో ప్రభుత్వ బియ్యం బొక్కేసిన కేసు నమోదయినప్పుడు పేర్ని నాని సైతం కొన్నాళ్లు ఎవరికీ కనిపించకుండా పోయారు. ఇక పోలీసుల గుడ్డలూడదీస్తానని వార్నింగ్‌ ఇచ్చి పారిపోయిన కాకాణి గోవర్ధన్‌ రెడ్డిని.. రెండు నెలలు గాలించి, తీరా బెంగళూరు రిసార్ట్‌లో సేద తీరుతుండగా అరెస్ట్‌ చేసి పట్టుకురావాల్సి వచ్చింది. పల్నాడు అరాచకవాదిగా పేరొందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా అరెస్టు నుండి తప్పించుకునేందుకు అజ్ఞాత వాసం గడిపిన వారే. ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అయితే ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. ఇక సజ్జల కుమారుడు సజ్జల భార్గవ్‌ రెడ్డి పరారీలో ఉన్నారో లేదో కానీ.. చాలా రోజులుగా కనిపించడం లేదు. వైసీపీ నేతలే కాదు.. వైసీపీ కోసం లైన్‌ క్రాస్‌ చేసి పనిచేసిన కొందరు అధికారులకూ అజ్ఞాత వాసం తప్పడం లేదు. అంతెందుకు.. విజయవాడలోనే ఉన్నా.. వచ్చి అరెస్ట్‌ చేసుకోమన్న జగన్‌ మోహన్‌ రెడ్డి.. రాత్రికి రాత్రే బెంగళూరు ప్యాలెస్‌కి పరుగు తీశారు.

ఇదంతా చూస్తుంటే.. టీడీపీ నేతలపై వైసీపీ హయాంలో పెట్టినవి ఆధారాలు లేని తప్పుడు కేసులనీ, అందుకే వారు పారిపోకుండా కేసులు ఎదుర్కొన్నారనీ.. కానీ వైసీపీ నేతలు మాత్రం పక్కా ఆధారాలతో దొరికిపోతుండటం వల్లే.. కేసులు అనగానే.. పరార్‌ అవుతున్నారనీ భావించాల్సి వస్తోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *