Kavitha: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న తాజా పరిణామాలు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ ఎందుకు ఆలస్యమవుతోంది? ఈ ప్రశ్న చాలా మందిలో సస్పెన్స్‌ను రేకెత్తిస్తోంది. దీని వెనుక కారణాలు తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే అన్నట్లు పరిణామాలుంటున్నాయ్. ఊహించని విధంగా… బీఆర్‌ఎస్ నాయకురాలు కవితకు, కాంగ్రెస్ క్యాబినెట్ విస్తరణకు ముడిపడి ఉందన్న ప్రచారం ఊపందుకుంది. ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కవిత కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారని, ఆమెకు మంత్రి పదవి ఆఫర్ చేయబడిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆసక్తికర విషయం ఏంటంటే, కవిత మొదట ఆ ప్రచారాన్ని ఖండించకపోవడమే కాదు, దానిపై వివరణ కూడా ఇవ్వదలుచుకోలేదు అన్నట్లుగా స్పందించారు. బదులుగా, “ఇది జర్నలిజం కాదు, శాడిజం” అంటూ కోపంగా ట్వీట్ చేశారు. కానీ, ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టంగా చెప్పకపోవడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.
బీఆర్‌ఎస్‌లో తనకు ఆశించిన ప్రాధాన్యత లభించడం లేదన్న అసంతృప్తితో కవిత రగిలిపోతున్నారు. పార్టీలో కేటీఆర్, హరీశ్‌లాంటి నాయకులు ప్రముఖ పాత్రలు పోషిస్తుండగా, కవితను రాజకీయంగా పక్కనపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్ సీఎం అయితే హరీశ్‌కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది, కానీ కుటుంబ సభ్యురాలిగా కవితకు ఆ అవకాశం దాదాపు లేదు. బీఆర్‌ఎస్‌లో మరో పవర్ సెంటర్‌గా ఎదగడం కూడా కష్టంగా మారింది కవితకు. ఈ నేపథ్యంలో, కవిత తన రాజకీయ భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్నారన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: Kavitha and Sharmila: కష్టాల్లో మేము.. కుర్చీల్లో మీరా?
Kavitha: ఇక, కవితను పార్టీలో చేర్చుకోవాలన్న ప్రతిపాదనపై కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆసక్తి కనబరుస్తోందని తెలుస్తోంది. గతంలో బీఆర్‌ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పి.. కేసీఆర్ మోసం చేశారన్న ఆగ్రహం కాంగ్రెస్ హైకమాండ్‌లో ఇప్పటికీ ఉంది. ఇప్పుడు కవితను చేర్చుకోవడం ద్వారా, కేసీఆర్‌కు గట్టి సమాధానం ఇవ్వాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను బలహీనపరిచే వ్యూహాత్మక చర్య కూడా కావొచ్చు. కవిత ఇవాళ ప్రెస్మీట్‌లో.. తాను కాంగ్రెస్‌లో చేరేది లేదని చెప్పి, క్లారిటీ ఇచ్చినట్లే కనబడుతున్నా… ఈ ఊహాగానాలు, రాజకీయ చర్చలు ఇప్పట్లో ఆగేలా కనబడటం లేదు. కవిత రూట్ ఏంటో స్పష్టంగా తేలేవరకూ ఈ ఊహాగానాలకు బ్రేకులు వెయ్యడం ఎవ్వరి తరమూ కాదు. ఇటు కవిత నెక్ట్స్ స్టెప్ ఏంటని అంతా చర్చించుకుంటున్న తరుణంలో… అటు కాంగ్రెస్ క్యాబినెట్ విస్తరణ వెనక్కి వెళ్లడం… మొత్తంగా తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా రసవత్తరంగా మారాయి. ఈ పొలిటిక్ డ్రామాలో తదుపరి ట్విస్ట్ ఏమిటో వేచి చూడాలి!