Kavitha and Sharmila: వారిద్దరు మొన్నటిదాకా అన్నలు వదిలిన బాణాలు. నేడు అన్నలు వదిలేసిన బాణాలయ్యారు. ఇద్దరి కథలు ఇంచుమించు ఒకటే. ఇద్దరి తండ్రులు సీఎంలుగా పనిచేసిన క్వాలిఫికేషన్‌తో.. వారసులుగా వీరి అన్నలు ముందుకొచ్చారు. రాజకీయాల్లో ఆడవారిది ఎప్పుడూ బ్యాక్ సీటే కదా. ఆ ట్రెండ్‌ని మారుద్దామని ఈ చెల్లెళ్లు ఇద్దరూ బలంగా ఫిక్స్ అయ్యారు. ఆస్తుల్లోనే కాదు.. అధికారంలోనూ వాటా ఇవ్వాల్సిందే అంటూ అన్నలతో పేచీ పెట్టుకున్నారు. ఇప్పటికే ఒకరు సొంత కుంపటి పెట్టుకుని దెబ్బతినగా.. ఇంకొకరు అదే దారిని ఎంచుకున్నారు. వీరి ప్రయాణంలో పూలు పడతాయా? రాళ్లు పడతాయా? అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఈ ఇద్దరు సిస్టర్ల ప్రసెంట్ సిచ్యుయేషన్ చూస్తే మాత్రం.. అందివచ్చిన అధికారం, తద్వారా పోగేసుకున్న ఆస్తులపై ఆరాటం.. మొత్తంగా ఇది బంగారు కుటుంబాల బాగోతం అంటూ పెదవి విరుస్తున్నారు కామన్ పబ్లిక్. ఇంతకీ ఆ బాణాలు ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుందిగా..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇద్దరు మహిళా నాయకులు సృష్టిస్తున్న సంచలనం ఒక్కసారిగా రెండు రాష్ట్రాల దృష్టినీ ఆకర్షిస్తోంది. వైఎస్ షర్మిల, కల్వకుంట్ల కవిత – ఇద్దరూ ఒకప్పుడు తమ అన్నల కోసం రాజకీయ యుద్ధభూమిలో బాణాలుగా మారి ప్రత్యర్థులపై విజృంభించారు. కానీ, నేడు వారే అన్నలు వదిలేసిన బాణాలుగా మారారు. తండ్రులు ముఖ్యమంత్రులుగా చరిత్ర సృష్టించిన వారసత్వంతో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన ఈ చెల్లెళ్లు, ఇప్పుడు అధికారంలో తమ వాటా కోసం, గుర్తింపు కోసం అన్నలతో పోరాడుతున్నారు. ఆస్తుల్లోనే కాదు, అధికారంలోనూ తమకు హక్కు కావాలన్న ఈ రెబల్ సిస్టర్స్ ప్రయాణం ఎటువైపు? వీరి ప్రయాణంలో రాళ్లు పడతాయా? పూలు పడతాయా? అన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోయింది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని కొనసాగించేందుకు వైఎస్‌ఆర్‌సీపీ స్థాపించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, చెల్లెలు షర్మిల స్ట్రాంగ్ పిల్లర్‌గా నిలిచింది. 2012లో జగన్ జైలులో ఉన్నసమయంలో, షర్మిల తన పదునైన ప్రసంగాలతో, ఊరూరా పాదయాత్రలతో పార్టీని నడిపించింది. 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఘన విజయం సాధించడంలో షర్మిల పాత్ర కీలకం. కానీ 25 ఎంపీ సీట్లు, 175 ఎమ్మెల్యే స్థానాలతో షర్మిలకు ఒక్క సీటు కేటాయించలేకపోయాడు జగన్. పార్టీలో కీలక పదవి కోసం ఆమె చేసిన డిమాండ్‌ను జగన్ పట్టించుకోలేదు. షర్మిలకు ఎంపీ టికెట్ కేటాయించాలన్న డిమాండే చివరకు వివేకా హత్యకు దారి తీసిందనే ఆరోపణ కూడా ఉంది. ఆ పరిణామాలతో అన్నపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన షర్మిల, 2021లో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి సొంత దారి చూసుకున్నారు. కానీ, ఆ పార్టీ ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయింది. చివరకు, 2024లో షర్మిల కాంగ్రెస్‌లో చేరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. 2024 ఎన్నికల్లో జగన్ ఓటమికి తనవంతు కృషి చేసిన షర్మిల, అన్న నిజస్వరూపాన్ని బయటపెట్టడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో జగన్ షర్మిలపై వ్యక్తిగత దాడులకు కూడా వెనుకాడలేదు. ఆస్తులు, అధికారంలో వాటా కోసం పోరాడుతున్న షర్మిలను లక్ష్యంగా చేసుకుని, చివరకు తల్లి వైఎస్ విజయమ్మను కూడా కోర్టు కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నించారు. షర్మిల ఇప్పుడు కాంగ్రెస్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
Also Read: Nadendla manohar: జూన్ 1 నుండి రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభం
Kavitha and Sharmila: మరోవైపు, తెలంగాణలో కల్వకుంట్ల కవిత కూడా ఇదే తరహా పోరాటంలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ‘తెలంగాణ జాగృతి’ సంస్థ ద్వారా బతుకమ్మలతో ఉద్యమ జ్వాలను రగిలించిన కవిత, టీఆర్‌ఎస్ లో కీలక పాత్ర పోషించారు. 2014లో నిజామాబాద్ ఎంపీగా గెలిచిన కవిత, 2019 ఎన్నికల్లో ఓటమి పాలై.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా కొనసాగారు. అయితే, పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ కవితకు ఆశించిన ప్రాధాన్యత దక్కలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమె పేరు బయటకు రావడం, జైలు శిక్ష అనుభవించడం బీఆర్‌ఎస్ పరువును దెబ్బతీశాయి. 2023లో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోవడంలో ఈ కేసు కూడా ఒక కారణంగా చెప్పబడుతోంది. తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్‌లు పార్టీలో అధికార పగ్గాలను పూర్తిగా చేపట్టడంతో, కవిత అసంతృప్తితో ఉన్నారని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. బీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాల్లో కేసీఆర్, కేటీఆర్‌లను మాత్రమే హైలైట్ చేయడంతో కవిత మండిపడ్డారు. తండ్రికి లేఖ రాసి తన అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆమె, పార్టీలో తనకు తగిన స్థానం కావాలని కోరుతున్నారు. కేసీఆర్ తర్వాత పార్టీ నాయకత్వం తనకే దక్కాలని కవిత బలంగా నమ్ముతున్నారు. కానీ, కేటీఆర్ ఆ దిశగా ముందుకు సాగుతుండడంతో, కవిత రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. షర్మిలలాగే సొంత పార్టీ పెట్టి కాంగ్రెస్‌లో చేరతారా? లేక నేరుగా కాంగ్రెస్ గూటికి వెళతారా? కవిత అడుగులు ఎటువైపు సాగుతాయన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
షర్మిల, కవితల కథలు ఒకే నాణెనికి రెండు వైపుల్లా కనిపిస్తున్నాయి. ఇద్దరూ తమ తండ్రుల వారసత్వాన్ని కొనసాగించేందుకు రాజకీయ రంగంలోకి వచ్చారు. ఇద్దరూ తమ అన్నల కోసం కష్టపడ్డారు. కానీ, అధికారంలో, పార్టీలో తమకు తగిన గుర్తింపు దక్కకపోవడంతో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈ ఇద్దరు చెల్లెళ్ల పోరాటం కేవలం అధికారం, ఆస్తుల కోసమేనా? లేక సొంత కుటుంబంలో అణచివేతని ఎదిరించి ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసమా? సామాన్య ప్రజలు మాత్రం.. బంగారు కుటుంబాల్లో బాగోతాలు, గోల్డెన్ స్పూన్ సంబంధాలు ఇలాగే ఉంటాయని చర్చించుకుంటున్నారు.