Ayodhya Ram Temple:

Ayodhya Ram Temple: సీఈఓ ఎంపికలో ఆసక్తికర ప్రశ్నలు.. 5,300 అప్లికేషన్లలో 18 మంది షార్ట్‌లిస్ట్!

Ayodhya Ram Temple: అయోధ్యలోని భవ్య శ్రీరామ మందిర పరిపాలన, బడ్జెట్, భక్తుల వసతుల పర్యవేక్షణ కోసం ‘శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’ తొలిసారిగా పూర్తిస్థాయి సీఈఓ (CEO) ను నియమించడానికి కసరత్తు వేగవంతం చేసింది. అయితే ఈ అత్యున్నత పదవికి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అభ్యర్థుల కేవలం పరిపాలనా అనుభవాన్ని మాత్రమే కాకుండా.. వారి వ్యక్తిగత జీవితం, మత విశ్వాసాలు, ఆహార అలవాట్లకు సంబంధించి ఎంపిక కమిటీ అడిగిన ప్రశ్నలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
మీరు పక్కా శాఖాహారా? మద్యం తాగుతారా?.. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు!
జూన్ నెలలో ఆలయ సిబ్బంది కానుకలు, నగదు చోరీకి పాల్పడిన ఘటన వెలుగులోకి రావడంతో ట్రస్ట్ ఈ సీఈఓ పోస్టును భర్తీ చేయడానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా వచ్చిన 5,300 కి పైగా దరఖాస్తుల్లో నుంచి 18 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు.
మంగళ, బుధవారాల్లో (ఆగస్టు 11, 12) అయోధ్య రామాలయ ప్రాంగణంలో రహస్యంగా జరిగిన ఇంటర్వ్యూల్లో అభ్యర్థులకు ఎదురైన కొన్ని కీలక ప్రశ్నలు ఇవే..
  • మతపరమైన అలవాట్లు: “మీరు తీవ్రమైన హిందూత్వ విశ్వాసాలు కలిగి ఉన్నారా?.. మీకు శిఖ (జట్టు) ఉందా?, మీరు జందెం ధరిస్తారా?
  • ఆహారం & అలవాట్లు: మీరు పక్కా శాకాహారా? నాన్-వెజ్ తింటారా?.. మీకు మద్యం తాగే అలవాటు ఉందా?
  • రామభక్తి & నిర్వహణ: శ్రీరాముడిపై మీకున్న విశ్వాసం ఏమిటి? భారీ సంఖ్యలో వచ్చే భక్తుల రద్దీని, ఆలయ వ్యాపారాలు/వసతులను మీరు గతంలో ఎలా సమర్థవంతంగా నిర్వహించారు?
ఎంపిక నిబంధనలు: సీఈఓగా ఎంపికయ్యే వ్యక్తి వయస్సు 50 నుండి 70 ఏళ్ల మధ్య ఉండాలని, హిందూ సంప్రదాయాలను కఠినంగా పాటించే సంపూర్ణ శాఖాహారి అలాగే మద్యపాన రహితుడు (Teetotaller) అయి ఉండాలని ట్రస్ట్ నిబంధన విధించింది.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రేసులో!
రిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) విష్ణుకాంత్ చతుర్వేది, శిర్డీ సాయిబాబా ట్రస్ట్ మాజీ చైర్మన్ సురేష్ హవారేలతో కూడిన త్రీమెన్ కమిటీ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసింది..
  1. కీలక అధికారులు పోటీలో: షార్ట్‌లిస్ట్ అయిన 18 మందిలో ముగ్గురు మాజీ ఐఏఎస్ (IAS) అధికారులు, ఒక రిటైర్డ్ ఐపీఎస్ (IPS) అధికారి ఇంకా నలుగురు మాజీ ఆర్మీ, విద్యా రంగ నిపుణులు ఉన్నారు.
  2. పోలీస్ దర్యాప్తు నేపథ్యం: యూపీ పోలీసులకు చెందిన ప్రత్యేక విచారణ బృందం (SIT) ఆలయ చోరీ కేసుపై విచారణ జరుపుతున్న నేపథ్యంలో, ఈ నెలాఖరు నాటికి పారదర్శకతతో సీఈఓ నియామకం పూర్తి చేయాలని ట్రస్ట్ భావిస్తోంది.

సాధారణ కార్పొరేట్ కంపెనీల ఇంటర్వ్యూలకు భిన్నంగా, ఒక పవిత్రమైన పుణ్యక్షేత్ర నిర్వహణ కోసం మతపరమైన విలువలకు పెద్దపీట వేస్తూ సాగిన ఈ ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *