Neeru Dhanda

Asian Games 2026: చరిత్ర సృష్టించిన భారత్.. షూటింగ్‌లో నీరూ ధండాకు ప‌త‌కం

Asian Games 2026: జపాన్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో (Asian Games 2026) భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. షూటింగ్ విభాగంలో వ్యక్తిగత స్వర్ణ పతకం కోసం దేశం ఎదురుచూస్తున్న నిరీక్షణకు భారత షూటర్ నీరూ ధండా తెరదించారు. మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో అద్భుతమైన గురితో సరికొత్త ఆసియా రికార్డును నెలకొల్పి పసిడి పతకాన్ని ముద్దాడారు.

హర్యానాకు చెందిన 26 ఏళ్ల నీరూ ధండా, ఫైనల్లో ఏకంగా 28 పాయింట్లు స్కోర్ చేసి 24 పాయింట్లతో ఉన్న పాత ఏషియన్ రికార్డును తుత్తునియలు చేశారు. ఈ అద్భుత విజయంతో ఆసియా క్రీడల చరిత్రలోనే మహిళల ట్రాప్ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా రికార్డులకెక్కారు.
ఆసియా క్రీడల చరిత్రలోనే తొలిసారి – సరికొత్త రికార్డు..
ఆసియా క్రీడల చరిత్రలో ఇప్పటివరకు వ్యక్తిగత ట్రాప్ లేదా స్కీట్ విభాగాల్లో ఏ భారత మహిళా షూటర్ కూడా కనీసం పతకం సాధించలేదు. ఆ రికార్డును తిరగరాస్తూ నీరూ ఏకంగా స్వర్ణాన్నే సొంతం చేసుకున్నారు.
గతంలో ట్రాప్ షూటింగ్‌లో భారత్‌కు వ్యక్తిగత స్వర్ణాలు పురుషుల విభాగంలో మాత్రమే వచ్చాయి. 1978లో రణధీర్ సింగ్ (ట్రాప్), 2010లో రంజన్ సోధి (డబుల్ ట్రాప్) మాత్రమే స్వర్ణాలు సాధించారు. ఆ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం నీరూ ఈ ఘనత సాధించిన ఏకైక షూటర్‌గా నిలిచారు.
ఎనిమిది మంది తలపడిన ఫైనల్స్‌కు ముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో నీరూ 118 పాయింట్లు సాధించి ఖతార్ షూటర్ రే బాసిల్‌తో సమంగా నిలిచి ఆసియా క్రీడల క్వాలిఫికేషన్ రికార్డును కూడా సమం చేశారు.
టీమ్ ఈవెంట్‌లోనూ రజత పతకం..
వ్యక్తిగత విభాగంలో పసిడి గెలవడానికి ముందే టీమ్ ఈవెంట్‌లోనూ నీరూ ధండా సత్తా చాటారు..
నీరూ ధండా, అషిమా అహ్లావత్, మనీషా కీర్‌లతో కూడిన భారత త్రయం మహిళల ట్రాప్ టీమ్ విభాగంలో 328 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విభాగంలో చైనా జట్టు 346 పాయింట్లతో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. వ్యక్తిగత విభాగంలో అషిమా (16వ స్థానం), మనీషా (23వ స్థానం) ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయినా, నీరూ ఒంటిచేత్తో ఫైనల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు.
నీరూ ధండా అంతర్జాతీయ ప్రస్థానం..

గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నీరూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 2022 ఐఎస్ఎస్ఎఫ్ (ISSF) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు. 2025 ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించారు. ఈ ఏడాది జూలైలో ఇటలీలోని లోనాటోలో జరిగిన షూటింగ్ ప్రపంచ కప్‌లో మహిళల ట్రాప్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ మహిళగా చరిత్రకెక్కారు. అలాగే కజకిస్తాన్‌లోని అల్మాటీ వరల్డ్ కప్‌లో మిక్స్‌డ్ ట్రాప్‌లో కాంస్య పతకం నెగ్గారు.తాజాగా 2026 ఆసియా క్రీడల్లో ఏషియన్ రికార్డుతో స్వర్ణం సాధించి భారతదేశ కీర్తిపతాకను అంతర్జాతీయ క్రీడావేదికపై రెపరెపలాడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *