Hanumakonda: హనుమకొండలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే నడిరోడ్డుపై ఆటోడ్రైవర్‌పై కత్తితో దాడికి దిగి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. హనుమకొండ మడికొండకు చెందిన రాజ్‌కుమార్, వెంకటేశ్ అనే ఇద్దరు వ్యక్తులు గత కొన్ని రోజులుగా అదే ప్రాంతానికి చెందిన లావణ్య అనే యువతి కోసం గొడవ పడుతున్నారు. వారిద్దరు ఆ యువతిని ప్రేమిస్తున్నారు.
తాజాగా అదాలత్ సెంటర్ వద్ద గొడవకు దిగారు. ఈ క్రమంలో వెంకటేశ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో రాజ్‌కుమార్‌ను విచక్షణారహితంగా పొడిచాడు. అక్కడ ఉన్నవారు ఆపినా ఆగలేదు. వెంకటేశ్ అనేక సార్లు రాజ్‌కుమార్‌ను పొడిచాడు. దీంతో ఆయన అక్కడిక్కడే పడిపోయాడు.
ఈ క్రమంలో వెంకటేశ్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా స్థానికులు ఎక్కడికి పారిపోకుండా ఆపేశారు. పోలీసులకు సమాచారం అందించారు. రాజ్‌కుమార్‌ను వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఇది మొదటగా వివాహేతర సంబంధం కారణంగా హత్య చేసి ఉంటారని భావించారు. కానీ యువతి ప్రేమ కోసం ఇద్దరు వ్యక్తుల తలపడినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా, ఇలాంటి ఘటనలు జరగటం ఆందోళన కలిగిస్తుంది. అయితే పట్టపగలు నడి రోడ్డు మీద ఇంత దారుణం జరుగుతున్నా జనం మాత్రం సినిమా చూసినట్టు చూస్తూ ఉండిపోయారే కానీ కనీసం వారి గొడవ ఆపే ప్రయత్నం కానీ, కత్తితో దాడికి వస్తున్న సమయంలో అడ్డుకునే సాహసం కానీ ఎవరూ చేయలేకపోయారు.