Vikarabad: ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామస్థుల అభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై దాడి జరిగింది. అదే జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకున్నది. విచారణకు వచ్చిన ఇతర అధికారులపైనా గ్రామస్థులు రాళ్లు, కర్రలతో దాడికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
Vikarabad: దుద్యాల, లగచర్ల, పోలేపల్లి, లగచర్ల తండాలో ఫార్మా కంపెనీల ఏర్పాటుపై రైతులతో చర్చించేందుకు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు గ్రామాలకు వచ్చారు. ఈ సమయంలో లగచర్లలో గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ గ్రామంలో ఫార్మా కంపెనీలు వద్దని నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో తీవ్ర ఆగ్రహోదగ్దులైన గ్రామస్థులు అధికారుల బృందంపై తిరగబడ్డారు.
కొందరు అధికారులను కార్లదాకా తరిమికొట్టారు. ఆ వాహనాలు ఊరవతలకు వెళ్లే వరకు తురుముతూ, రాళ్ల దాడులు చేస్తూ గ్రామస్థులు వెంటపడ్డారు. మరో ఇద్దరిని పొలాల వెంట తరిమికొట్టారు.
Vikarabad: రాళ్లు, కర్రలతో రైతులు, గ్రామస్థులు దాడికి దిగారు. ఈ దాడిలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ సమయంలో కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై ఓ మహిళ చేయిచేసుకున్నది. ఇదే సమయంలో కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, ఇతర అధికారులపైనా గ్రామస్థులు దాడి చేశారు. దీంతో గ్రామంలో పోలీసులు మోహరించారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు.