Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పెట్టుబడులకు, సరికొత్త ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్‌గా మార్చే వ్యూహంతో కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్.. రెండో రోజు సోమవారం సియోల్ బిజినెస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో కొరియన్ టెక్ స్టార్టప్‌లతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీని ఒక పారిశ్రామిక విప్లవ కేంద్రంగా మార్చేలా అత్యంత ఆకర్షణీయమైన ప్రతిపాదనలను కొరియా దిగ్గజ కంపెనీల ముందుంచారు.
ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లే లక్ష్యం..
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) ద్వారా “ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్త” అనే వినూత్న నినాదంతో రాబోయే ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లను స్థాపించి, లక్ష మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఏపీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి లోకేశ్ ప్రకటించారు. ఈ ఆర్టీఐహెచ్ను కేంద్రంగా చేసుకుని ‘భారత్-కొరియా స్టార్టప్ కారిడార్’ను ఏర్పాటు చేయడానికి కొరియన్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఆర్టీఐహెచ్లోని స్పార్క్ (ఆలోచనల రూపకల్పన), కెటలిస్ట్, వెలాసిటీ ల్యాబ్‌లలో కొరియన్ స్టార్టప్‌లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని, ఏపీలో ప్రత్యేక కొరియా డెస్క్, సాఫ్ట్ ల్యాండింగ్ వీసీ బే, కొరియన్ ఏజెన్సీలతో సహ-ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతిలో ఏర్పాటు కాబోతున్న క్వాంటమ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విశ్వవిద్యాలయం కొరియన్ డీప్‌టెక్ స్టార్టప్‌ల పరిశోధనలకు అద్భుతమైన వేదికగా మారుతుందని స్పష్టం చేశారు.
కొరియా పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి లోకేశ్ భేటీ – ముఖ్యాంశాలు..
దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ పలు టాప్ మొబిలిటీ, ఎలక్ట్రానిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల ప్రతినిధులతో విడివిడిగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడుల పురోగతిపై చర్చించారు..
| కంపెనీ పేరు | పెట్టుబడి / ప్రతిపాదన వివరాలు | ఉపాధి & మౌలిక వసతులు |
|
షూఆల్స్ కంపెనీ లిమిటెడ్ (స్మార్ట్ హెల్త్‌కేర్ ఫుట్‌వేర్) |
ఏపీలో రూ. 300 కోట్లతో పాదరక్షల తయారీ యూనిట్ స్థాపన. రాబోయే రోజుల్లో ఏపీని రీజినల్ ఆర్ అండ్ డి మరియు డిస్ట్రిబ్యూషన్ హబ్‌గా మార్చాలని లోకేశ్ ప్రతిపాదన. | సుమారు 3,000 మందికి నూతన ఉపాధి అవకాశాలు. |
|
సోలమ్ గ్రూప్ (ఈఎస్ఎల్ & ఐవోటీ దిగ్గజం) |
శ్రీసిటీలో రూ. 338 కోట్లతో నిర్మిస్తున్న ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యూల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ యూనిట్ పనుల వేగవంతం. తిరుపతిలో ఉన్న సీఎస్‌వోటీ (TCL) సదుపాయాల దృష్ట్యా ఇక్కడే డిస్ప్లే ఉత్పత్తుల తయారీకి ఆహ్వానం. | పనులు ముగించి త్వరలోనే వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం. |
|
సాఫ్ట్-ఈపీఐ (సెమీకండక్టర్ మెటీరియల్స్) |
ఏపీలో సరికొత్త మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే మరియు మెటీరియల్ హబ్ ఏర్పాటుపై చర్చలు. | తిరుపతి ఐఐటీ (IIT) భాగస్వామ్యంతో ఏటా 500 మంది స్థానిక టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చేలా సాఫ్ట్-ఈపీఐ అకాడమీ స్థాపన. |
|
హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ (పవర్ సిస్టమ్స్) |
తిరుపతి, శ్రీసిటీ సమీపంలో స్విచ్గేర్లు, క్లీన్ ఎనర్జీ, అణు విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమయ్యే భారీ 765/800 కేవీ ట్రాన్స్ఫార్మర్లు, జీఐఎస్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆహ్వానం. | రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణకు దోహదం. |
|
సియోల్ సెమీకండక్టర్ (డిస్ప్లే ఫ్యాబ్) |
శ్రీసిటీ పరిసర ప్రాంతాల్లో అత్యాధునిక డిస్ప్లే ఫ్యాబ్ ప్లాంట్ ఏర్పాటుపై చర్చలు. ఏపీ ప్రభుత్వ రాయితీలు, ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానాలను పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని సంస్థ వైస్ ప్రెసిడెంట్ తాయ్హ్యుంగ్ లీ వెల్లడి. | భారతదేశంలో సంస్థ యొక్క తొలి భారీ పెట్టుబడి ప్రణాళికలు. |
మంత్రి లోకేశ్ సందేశం: వెయ్యి కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న సుదీర్ఘ ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం వెంబడి లాజిస్టిక్స్, ఫిన్‌టెక్, డీప్‌టెక్, ఫ్రాంటియర్ టెక్నాలజీ, అధునాతన తయారీ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి కొరియన్ సంస్థలకు ఏపీ ఒక గోల్డెన్ గమ్యస్థానంగా మారబోతోంది. పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
