AP New Zilla Parishads

AP New Zilla Parishads: 13 జెడ్పీల స్థానంలో 28 కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటు

AP New Zilla Parishads: ఆంధ్రప్రదేశ్‌లో పాలనా వికేంద్రీకరణను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది. జిల్లాల పునర్విభజన తర్వాత ప్రజలకు మరింత మెరుగైన స్థానిక పాలన అందించే లక్ష్యంతో జిల్లా ప్రజా పరిషత్‌లను పునర్వ్యవస్థీకరించింది. ప్రస్తుతం ఉన్న పాత ఉమ్మడి 13 జెడ్పీల స్థానంలో ఏకంగా 28 కొత్త జిల్లా ప్రజా పరిషత్‌లను ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల నూతనంగా ఏర్పాటైన మార్కాపురం, పోలవరం జిల్లాలతో కలిపి రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాలకు 28 ప్రత్యేక జెడ్పీలు కొలువుదీరనున్నాయి.

సెప్టెంబర్ 24 తర్వాత అమలు – 660 మండలాల మ్యాపింగ్..

ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపదికన గతంలో ఏర్పాటైన ప్రస్తుత జెడ్పీ పాలకవర్గాల పదవీకాలం సెప్టెంబర్ 24తో ముగియనుంది. ఈ గడువు పూర్తయిన వెంటనే 28 కొత్త జెడ్పీల వ్యవస్థ అధికారికంగా అమల్లోకి వస్తుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 660 మండల ప్రజా పరిషత్‌లను కొత్త జిల్లాల భౌగోళిక సరిహద్దులకు అనుగుణంగా ఆయా జెడ్పీల పరిధిలోకి మ్యాపింగ్ చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్‌ను ఆదేశించారు. భవిష్యత్తులో ఏదైనా మండలం పునర్వ్యవస్థీకరణ జరిగితే అందుకు తగ్గట్లుగా జెడ్పీ పరిధిని మార్చుకునే వెసులుబాటు కూడా కల్పించారు.

కొత్తగా 30 కీలక పోస్టుల సృష్టి – వేతన స్కేలు ఖరారు..

కొత్త జెడ్పీల పాలనా యంత్రాంగం సజావుగా సాగేందుకు ప్రభుత్వం 30 కీలక ఉన్నత స్థాయి పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది..
  • 15 సీఈవో (CEO) పోస్టులు:
    వీరి వేతన స్కేలును రూ.80,910 నుంచి రూ.1,66,680గా నిర్ణయించారు.
  • 15 డిప్యూటీ సీఈవో పోస్టులు:
    వీరి వేతన స్కేలును రూ.65,360 నుంచి రూ.1,54,980గా ఖరారు చేశారు.
  • సిబ్బంది హేతుబద్ధీకరణ:
    ప్రస్తుతం పాత 13 జెడ్పీల్లో పనిచేస్తున్న మినిస్టీరియల్, సహాయక సిబ్బందిని కొత్త జిల్లాల్లోని మండలాల సంఖ్య, పనిభారాన్ని బట్టి హేతుబద్ధీకరించి కొత్త జెడ్పీలకు సర్దుబాటు చేస్తారు.

అధికారులకు ఆదేశాలు..

కొత్త జెడ్పీల ఏర్పాటు, రికార్డులు, ఆస్తులు, సిబ్బంది విభజన ప్రక్రియ ఎలాంటి పాలనాపరమైన అవాంతరాలు లేకుండా వేగంగా పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, ఎంపీపీ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ చర్యతో గ్రామీణాభివృద్ధి పనులు మరింత వేగవంతమై, ప్రజలకు స్థానిక సమస్యల పరిష్కారంలో జాప్యం తగ్గుతుందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *